వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు భూమా నాగిరెడ్డి తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారంటూ మధ్యాహ్నం వరకు తెగ చర్చలు జరిగాయి. కానీ సాయంత్రానికి అంతా చప్పున చల్లారిపోయింది. చేరిక వ్యవహారం సస్పెన్స్‌లో పడిపోయింది. ఒకవైపు భూమా తో మంతనాలు జరిపిన వైకాపా దూతలు.. ఆయన తెదేపాలో చేరబోతున్నారనే వార్తలు అసత్యాలంటూ కొట్టి పారేశారు. అదే సమయంలో.. చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. తాము మళ్లీ చంద్రబాబు తో సమావేశం అయి చర్చించేవరకు భూమా చేరిక ఉండకపోవచ్చునని తేల్చేశారు. మొత్తానికి ‘ఆదివారం చేరిక’ అనేది ఆగిపోయింది. అయితే దానిని జగన్ ఆపినట్లా? చంద్రబాబు ఆపినట్లా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.
ఒకవైపు జగన్ తరఫు రాయబారానికి వెళ్లిన దూతలు ఎన్ని రకాలుగా రాజీ చర్చలు జరిపినా.. భూమా నాగిరెడ్డి దిగిరాకపోవడం.. అదే సమయంలో.. అవకాశ వాదుల విషయంలో మనం ఏమీ చేయలేం అంటూ కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల భేటీలో జగన్ నిర్వేదం వ్యక్తం చేయడం కూడా జరిగిపోయింది. భూమా మీద జగన్ ఆశ వదిలేసుకున్నారంటూ టీవీ ఛానళ్లు స్క్రోలింగులు కూడా ఇచ్చేశాయి.
మరోవైపు భూమా చేరికపై కర్నూలు తెదేపా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారితో చంద్రబాబు నాయుడు భేటీ ఏకంగా రెండు గంటల పాటు జరగడం విశేషం. కీలకనాయకులు చాలా మంది ఈ చేరికను వ్యతిరేకించినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీ తర్వాత బయటకు వచ్చిన నాయకులు మరోసారి భేటీ అయ్యాక నిర్ణయం తీసుకుందాం అని చంద్రబాబు చెప్పినట్లుగా వెల్లడించారు. ఇంకో భేటీ జరిగే వరకు భూమా చేరిక ఉండదనే క్లారిటీ కూడా ఇచ్చారు.
ఈ పరిణామాలన్నిటినీ ఒక వరుసలో సింక్ చేసే ప్రయత్నం చేస్తే సస్పెన్స్ ముదురుతోంది. నిజానికి తెదేపా నాయకులకంటె ముందే వైకాపా నాయకులు భూమా వెళ్లడం లేదని ప్రకటించారు గనుక.. జగన్ ఆపడంలో సక్సెస్ అయినట్లు భావించాల్సిందేనా అనిపిస్తోంది. అయితే భూమా పట్ల స్థానిక నేతల్లో ఉన్న అసంతృప్తిని బుజ్జగించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా మరో భేటీ గడువు తీసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. మొత్తానికి రాజకీయ పరిణామాలన్నీ తన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నోరు మెదపకుండా, వ్యూహాత్మక మౌనం పాటిస్తుండడం విశేషం.