ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సింగరేణి విషయంలోనూ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అన్ని అమ్మేస్తున్నట్లుగానే సింగరేణిని కూడా కొద్ది కొద్దిగా కేంద్రం అమ్ముతోంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలం వేయాలని నిర్ణయించింది . దీనికి సంబంధించి సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇది సింగరేణి కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారంతా సమ్మె బాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో సమ్మె చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు కేసీఆర్.. ఆ బొగ్గు వేలాన్ని ఆపాలని కోరుతున్నారు.
ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశిన కేసీఆర్.. ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని అలాంటి బొగ్గు గనులను అమ్మేయవద్దని కోరారు. తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని .,. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడుతుందన్నారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ లేఖ ఇప్పటికే ఆలస్యమయిందన్న అభిప్రాయం సింగరేణి కార్మికుల్లో ఉంది.