ఇప్పుడంతా డిజిటల్ శకం. టీ కొట్టువాళ్లు కూడా ఫోన్ పే, గూగుల్ పే వాడుతూంటారు. అంతా కార్డు పేమెంట్స్ చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేంటో కానీ ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో మాత్రం ఓన్లీ క్యాష్. ఎందుకిలా ? అని చాలా రోజులుగా అనుమానాలు..ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికీ డిజిటల్ పేమెంట్లను అంగీకరించడంలేదు. ఈ అంశాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించారు. మద్యందుకాణాల్లో క్యాష్ మాత్రమే తీసుకోవడం వెనుక భారీ స్కాం ఉందని.. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కొన్ని వేల కోట్ల వ్యాపారాన్ని మద్యం దుకాణాలు చేస్తున్నాయి.. ఇంత పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో సేకరిస్తున్నారని.. ఆయన అంటున్నారు. ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం వ్యవస్థీకృతం అయింది. ప్రధానమైన బ్రాండ్లు అమ్మడంలేదు. వైసీపీ నేతల తయారీ సరుకే అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తయారీ, రవాణా, అమ్మకం ఇలా మొత్తం వారి గుప్పిట్లోనే ఉండటంతో… ఏదో పెద్ద స్కాం ఉందన్న అనుమానాలు విపక్ష నేతలు చాలా కాలం నుంచి వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్‌గా తీసుకంటే రికార్డుల్లోకి వెళ్తుదంని.. అదే క్యాష్ రూపంలో తీసుకుంటే ఎంత లెక్క చెబితే అంతే అని.. అందుకే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం ఆరా తీస్తే కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంతకు ముందు రఘురామ చేసిన చాలా ఆరోపణలపై కేంద్రం స్పందించింది. దీనిపైనా స్పందిస్తే ప్రభుత్వానికి కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు.