విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా తొలగించడం కాక రేపుతోంది. మామూలుగా అయితే కోహ్లీకి గౌరవంగా కెప్టెన్‌గా తప్పుకునే చాన్సివ్వాలి. గతంలో టీ ట్వంటీ కెప్టెన్సీకి అలాగే వైదొలిగాడు. అయితే ఇప్పుడు మాత్రం సెలక్టర్లు కోహ్లీకి అలాంటి అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం వేస్తోంది. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం కోహ్లీకి రెండు రోజులు చాన్సిచ్చామని ఆయన ఏ విషయం చెప్పకపోయే సరికి తొలగించామని చెబుతున్నాయి.
ఈ అంశంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా క్రీడా రంగంలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై ఒక్క మాట కూడా కోహ్లీ మాట్లాడలేదు. రోహిత్ శర్మకు గుడ్ లక్ కూడా చెప్పలేదు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమ్ఇండియా బయల్దేరనుంది. మూడు టెస్టుల సిరీసు కోసం బుధవారం రాత్రి జట్టును ప్రకటించారు. టెస్టులకు కోహ్లీనే కెప్టెన్. వన్డే జట్టును ఎంపిక చేయనప్పటికీ రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించేశారు.
వైట్ బాల్ మ్యాచ్‌లకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని సెలక్టర్లు కారణం చెప్పారు. నిజానికి కోహ్లీ విజయాల శాతం మెరుగ్గానే ఉంది కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించని విషయాన్ని లోపంగా భావిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరాటం ఉందన్న ప్రచారం నేపధ్యంలో తాజా పరిణామం వారి మధ్య మరింత ఆగాధం పెంచే అవకాశం ఉంది. అది టీం ఇండియాకు ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉంది.