వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు మొదటి రోజు నుండే శర వేగంగా మొదలయ్యాయి. ఆ పని చేపట్టిన ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజి సంస్థలు భారీ యంత్రాలను, నిర్మాణ సామాగ్రిని వెలగపూడికి చేర్చుతున్నాయి. పని మొదలుపెట్టిన రోజునే భూపరీక్షలు చేయడం మొదలుపెట్టేయి. త్వరలోనే అది పూర్తి కావచ్చును. సచివాలయ భవనాలన్నీ ప్రీ-ఫ్యాబ్రికేటడ్ విధానంలో నిర్మించబోతున్నారు కనుక భవనాలకి పిల్లర్లను కూడా ముందుగానే తయారు చేసుకొన్నారు.
బారీ డ్రిల్లింగ్ రిగ్స్ తో సుమారు 30 మీటర్లు లోతున భూమిలో రంద్రాలు చేసి వాటిల్లో ముందే సిద్దం చేసుకొన్న కాంక్రీట్ పిల్లర్లను హేమరింగ్ రిట్జ్ అనే భారీ యంత్రాల ద్వారా ఒత్తిడితో దించుతారు. ఆవిధంగా అన్ని పిల్లర్లను దించిన తరువాత వాటిపై ముందే సిద్దం చేసుకొన్న కాంక్రీట్ తో తయారయిన స్లాబులను, గోడలను, పైకప్పులను అమర్చి భవన నిర్మాణం చేస్తారు. ఈ పిల్లర్ల పని మార్చి నెలాఖరులోగా పూర్తవుతుందని ఆ సంస్థల ప్రాజెక్టు మేనేజర్లు చంద్రశేఖర్, హరినారాయణ తెలిపారు.
ఈ భవనాల నిర్మాణానికి అవసరమయిన నీళ్ళు, విద్యుత్ కి సదరు సంస్థలే డబ్బు చెల్లిస్తాయి కానీ సరఫరా చేయవలసిన బాధ్యత మాత్రం సంబంధిత ప్రభుత్వ శాఖలదే. కనుక సి.ఆర్.డి.ఏ.కమీషనర్ శ్రీకాంత్ సంబంధిత శాఖల అధికారులతో నిన్న సమావేశమయ్యి వారిని పూర్తి సమన్వయంతో పని చేయవలసిందిగా కోరారు.