ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు మరోసారి కోర్టు ధిక్కరణ చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యా దీవెన పథకం నిధులను కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలని గతంలోహైకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేశామన్న కారణం చూపించి పథకం నిధులను ఇటీవలే సీఎం జగన్ తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వారం పది రోజుల్లో కాలేజీలకు కట్టాలని లేకపోతే ఈ సారి నేరుగా కాలేజీలకు జమ చేయాల్సి వస్తుందన్నారు.
వారు కట్టారా లేదాఅన్నది తర్వాత సంగతి కానీ హైకోర్టు కాలేజీలకు ఇవ్వాలి అన్న ఉత్తర్వులు ఇచ్చినప్పుడు వాటిని ఉల్లంఘించి మళ్లీ తల్లుల ఖాతాల్లో జమ చేయడం ఇప్పుడు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. మూడు నెలలకోసారి విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ను ఏపీ సర్కార్ విడుదల చేస్తోంది. గత వాయిదాలో కేవలం 30 శాతం మంది తల్లులు మాత్రమే ఫీజులుకాలేజీలకు కట్టారు.
దీంతో కాలేజీలు తమకే ఫీజులుఇవ్వాలని కోర్టును ఆశ్రయించాయి. దీనిపై కాలేజీలకే ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ రివ్యూ పిటిషన్ వేసి తమ దారిన తాము పథకం అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు కాలేజీలు మళ్లీ విద్యార్థుల తల్లులుతమకు ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవిస్తే కోర్టు ధిక్కరణ కింద అధికారులు ఇబ్బందిపడటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.