హరీష్ రావు ఒకప్పుడు సిద్దిపేట బయట కనిపించేవారు కాదు. ఆయన గతంలో నిర్వహించిన నీటిపారుదల శాఖకు సంబంధించి కాళేశ్వరం లాంటి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల ఓపెనింగ్లలోనూ ఆయన కనిపించేవారు కాదు. చివరికి ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఆయన ఎప్పుడైనా అధికారులతో సమీక్షలు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. చివరికి విద్యుత్ శాఖపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. హరీష్ రావుకు విద్యుత్ శాఖతో సంబంధం లేదు. ఆయన ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.
విద్యుత్ శాఖకు మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ హరీష్ సమీక్ష పెట్టారు. మొత్తం ఆదాయ వ్యయాలల లెక్కలను తీశారు. చార్జీలు ఎంత పెంచాలన్నదానిపై చర్చించారు. అయితే హరీష్ రావు పక్కన విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అలా కూర్చున్నారు అంతే.. మిగతా సమీక్ష అంతా హరీష్ రావు నడిపారు. గతంలో కేసీఆర్ ఈ తరహా సమీక్షలు చేసేవారు. కేసీఆర్, కేటీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లిన సమయంలోనే హరీష్ ఇలా సమీక్షలు చేయడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
అయితే కరెంట్ చార్జీలు పెంచే ఉద్దేశంలో ఉన్న ప్రభుత్వం ఆలస్యం కాకుండా ఉండేందుకు హరీష్ ను సమీక్ష చేయాలని ఆదేశించిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తేనే హరీష్ సమీక్ష చేశారని అంటున్నారు. అయితే సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంత మాత్రం దానికే సమీక్ష ఎందుకని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయం ఎవరికీ అర్థం కావడం లేదన్న భావనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.