టాలీవుడ్ లో ప్రతిభ గల దర్శకుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఏడాది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తొలి ప్రయత్నంలోనే హిట్లు కొట్టి భవిష్యత్ పై ఆశలు పెంచుతున్నారు. ఈ ఏడాది కూడా తొలి సినిమానే విజయంగా మలచిన దర్శకులు ఉన్నారు. ఈ వరుసలో ముందుగా చెప్పుకోవలసిన పేరు.. బుచ్చి బాబు. సుకుమార్ శిష్యుడు అనే ట్యాగ్ తో ‘ఉప్పెన’ సినిమా చేశాడు బుచ్చి బాబు. సినిమా రిలీజైన తర్వాత గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. తొలి సినిమాకే మంచి అనుభవం వున్న దర్శకుడిలా .. ఓ ప్రేమకథని మలిచాడు. కథ రాసుకోవడం దగ్గర నుంచి.. మంచి ఆడియో రాబట్టుకోవడం, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తొలిపరిచయం నటులతో.. మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. ఈ సినిమా వసూళ్ళు పరంగా కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బుచ్చి బాబు హాట్ కేక్ లాంటి దర్శకుడే. మంచి కధ సెట్ అయితే స్టార్ హీరోలు కూడా బుచ్చితో సినిమా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడీయన.
ఈ ఏడాది ప్రేక్షకులని అలరించిన మరో చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ దగ్గర ఘన మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో అనుదీప్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలుగు ప్రేక్షలులు అన్నీ వేళల ఆదరించే జోనర్.. కామెడీ. అదే పాయింట్ ని బలంగా పట్టుకున్నాడు అనుదీప్. ఎలాగైనా ప్రేక్షకుడిని నవ్వించాలనే లక్ష్యంగా రాసుకున్న జాతి రత్నాలు .. కామెడీ రత్నాలుగా ప్రేక్షకుల ఆమోదం పొందింది. నవీన్ పొలిశెట్టి లాంటి క్యాలిబర్ వున్న నటుడు దొరకడం సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. ప్రతి సీన్ కి హ్యుమర్ టచ్ ఇస్తూ తెరకెక్కించిన జాతి రత్నాలు అనుదీప్ కి హిట్ డైరెక్టర్ టైటిల్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో ఓ సినిమాకి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అనుదీప్. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ ఏడాది విజయం సాధించిన సినిమాల్లో అల్లరి నరేష్ ‘నాంది’ కూడా వుంది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు వెలుగులోకి వచ్చాడు. అతనే.. విజయ్ కనకమేడల. తొలి ప్రయత్నంలో న్యాయ శాస్త్రంలోని ‘211సెక్షన్’ తో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకొని వైవిధ్యమైన ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకి మంచి ప్రసంసలు దక్కాయి. సీరియస్ ఫిల్మ్ మేకర్ అనే కితాబులు అందుకున్నాడు విజయ్. నాంది సినిమా అటు ఎన్నేళ్ళుగానో అల్లరి నరేష్ ఎదురుచూస్తున్న విజయాన్ని కూడా ఇచ్చింది.
ఈ ఏడాది ఓటీటీ సత్తా చాటిన సినిమాలు కూడా వున్నాయి. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘సినిమా బండి’ కి మంచి రివ్యూలు దక్కాయి. ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని ప్రవీణ్ తెరకెక్కించిన సినిమా బండి .. సినిమాని ఇష్టపడేవారికి తెగ నచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో కార్తిక్ రాప్రోలు అనే దర్శకుడు పరిచయమయ్యాడు. అమోజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాని వెబ్ ఆడియన్స్ లో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాతో తొలి ప్రయత్నంలోనే పాస్ మార్కులు తెచ్చుకున్నాడు కార్తిక్. శ్రీ విష్ణు హీరో గా వచ్చిన ‘రాజ రాజ చోర’ సినిమాతో పరిచయమైన హసిత్ గోలి కూడా ప్రామెసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. లిమిటెడ్ బడ్జెట్ లో యంగేజింగ్ కంటెంట్ తీయగల దర్శకుల జాబితాలో చేరాడు.
ఇక ఏడాది ఓ మహిళా దర్శకురాలు కెప్టెన్ చైర్ లో కూర్చుంది ‘వరుడు కావాలెను’ చిత్రంతో తొలి అడుగులోనే డైరెక్టర్గా నిరూపించుకుంది లక్ష్మీ సౌజన్య. సితార లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో వచ్చిన వరుడు కావలెను డీసెంట్ హిట్ ని సొంతం చేసుకుంది. అటు దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్యకి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ లాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ వచ్చింది. దాదాపు అరడజను మంది దర్శకులు హిట్లతో ప్రయాణం మొదలుపెట్టడం అభినందనీయం.