వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నామొన్నటిదాకా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి కలవాల్సిన వాళ్లందర్నీ కలిసి…చెప్పాలనుకున్నదంతా చెప్పి వెళ్లారు. ఇప్పుడు ఆ బాధ్యతను పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీసుకున్నారు. ఆయన పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. కేంద్ర ఆర్థిక మంత్రినీ కలిశారు. వారు చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే.. చేస్తున్న ప్రయత్నం ఒక్కటే ..అదే అప్పుల పరిమితి తొలగించడం.
విభజన తర్వాత ఏపీ ఎన్నో కష్టాలు పడుతోందని .. ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉందని అప్పులు పరిమితి పెంచకపోతే పూట గడవదని చెబుతూ బతిమాలుతున్నారు. నిజానికి గత నెలలోనే అప్పుల పరిమితి ముగిసిపోయింది. ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ చేసుకున్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ పేరుతో మరో రూ. ఐదు వేల కోట్లు అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కానీ గత నెలలోనే జీతాలు..ఇతర అవసరాలకు సరిపోక.. ఎన్టీఆర్ వర్శిటీ నుంచి నిధులు కూడా తీసుకున్నారు. అలాంటివన్నీ వెదికి వెదికి ఆ నెలకు సరి పెట్టారు.
ఇప్పటికే ఈ నెల సగం రోజులు గడిచిపోయింది. వచ్చే నెల జీతాలు ఇవ్వాలన్నా.. వడ్డీలు కట్టాలన్నా నిధులు సేకరించాల్సి ఉంటుంది. అందుకు కావాల్సింది అప్పుల పరిమితి పెంపు. అందుకే ఢిల్లీ మీద ప్లీజ్..ప్లీజ్ అంటూ దండయాత్ర చేస్తున్నారు. ఇంకా విషయం ఏమిటంటే ఈ నెల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను కూడా కేంద్రం గత నెలలోనే ఇచ్చింది. అది కూడా ఈ నెల రాదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. అప్పుల పరిమితి పెంచితే ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద రూ. రెండు వేల కోట్లు తీసుకోవచ్చు. అందుకే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.