మాట దూకుడు.. మనిషి దూకుడుగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజాకు రోజు రోజుకు రాజకీయ శత్రువులు పెరిగిపోతున్నారు. వారికి సొంత పార్టీలో ముఖ్య నేతల మద్దతు ఉండటంతో వారు ధైర్యంగా బయటకు వచ్చి రోజాకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఐదు మండలాలకు చెందిన ముఖ్య నేతలు నగరిలో సమావేశమై ఇక రోజాను గెలిపించే ప్రశ్నే లేదని తీర్మానించారు. ఈ ఐదుమండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో పట్టు ఉన్న వారు ఉన్నారు.
రోజా నగరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వీరంతా ఆమె విజయానికి కృషి చేశారు. దానికి తోడు ఆమె తమిళ నేపధ్యం ఉపయోగపడింది. కానీ రాను రాను రోజా తన సొంత వర్గాన్ని పెంచుకునే క్రమంలో కీలక నేతలందర్నీ దూరం చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో కూడా వారిని కలుపుకుని వెళ్లేప్రయత్నం చేయకుండా సొంత అభ్యర్థుల్ని నిలబెట్టుకుంది. కొన్ని చోట్ల గెలిచారు.. కొన్ని చోట్ల ఓడారు. అయితే క్షేత్ర స్థాయిలో పట్టున్న నేతలు మాత్రం ఆమెకు వ్యతిరేకమయ్యారు.
ఇప్పుడు రోజాకు పొగ పెట్టేందుకు ముఖ్య నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐదు మండలాల నేతలు సమావేశం పెట్టి.. ఇక మరోసారి రోజాకు చాన్సిస్తే గెలిపించే చాన్సే లేదని తీర్మానించుకున్నారు. ఈ విషయాన్ని తాము హైకమాండ్‌ను నేరుగా చెబుతామంటున్నారు. నిజానికి పై స్థాయిలో ప్రోత్సాహం లేకపోతే వీరు ఇలా సమావేశం కారని రోజా వర్గీయులు కూడా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మంత్రివర్గ విస్తరణ జరిగితే పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న రోజాకు ఇప్పుడు ఉన్న సీటు నిలబెట్టుకోవడమేగండంగా మారే పరిస్థితి వచ్చింది.