స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరిగితే ఆరింటిలోనూ విజయం సాధించింది. నల్లగొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, మెదక్‌లో యాదవరెడ్డి, కరీంనగర్లో ఎల్.రమణ, భాను ప్రసాదరావు, ఆదిలాబాద్‌లో విఠల్ గెలిచారు. ఎమ్మెల్సీలు అయ్యారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆందోళన ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఓడిపోయే స్థాయిలో ఉంటుందని టీఆర్ఎస్ నేతలూ అనుకోలేదు.
ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఓటర్లందర్నీ క్యాంపులకు తరలించారు. పక్కాగా ఓటింగ్ వేయించుకున్నారు. చివరికి మెదక్ ఓటర్లను కూడా క్యాంపులకు తరలించాలంటే ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారో ఆర్థం చేసుకోవచ్చు. సొంత ఓటర్లు ఓటేయకపోయినా.. ఒక్క అభ్యర్థి ఓడిపోయినా పరిస్థితి దారుణంగా ఉంటుందన్న ఉద్దేశంతో హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా గుర్తించారు.
ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఊహించినంత కన్నా ఎక్కువగానే క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా భావిస్తున్నారు. మొత్త ఫలితాలపై రివ్యూ చేసి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై టీఆర్ఎస్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం పన్నెండు ఎమ్మెల్సీలు స్థానిక కోటాలో జరగగా.. ఆరు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన ఆరింటిలోనూ విజయం సాధించారు. అంటే.. మొత్తం పన్నెండు స్థానాలూ టీఆర్ఎస్ ఖాతాలో పడినట్లయింది.