ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల తర్వాత సామాజిక పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చంద్రబాబు పెన్షన్ను రూ. రెండు వేలు చేసినప్పుడు.. సీఎం జగన్ తాను రూ. మూడు వేలకు పెంచుతూ పోతానని ప్రకటించారు. ప్రమాణస్వీకార వేదికపై రూ. 250 పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఏడాదికి రూ. 250 చొప్పున పెంచుతామని… ప్రకటించారు. అయితే రెండేళ్లు పెంచలేదు.
ఈ ఏడాది విడుదల చేసిన సంక్షేమక్యాలెండర్లో జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ. రెండు వందల యాభై పెంచుతామని ప్రకటించారు. ఆ క్యాలెండర్ ప్రకారం.. రూ. రెండు వందల యాభై పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు రూ. రెండు వేల రెండు వందల యాభై చొప్పున ఇస్తున్న పెన్షన్ ఇక ముందు.. రెండున్నర వేలుగా ఉండనుంది. దాదాపుగా యాభై లక్షల మందికిపైగా లబ్ది పొందే అవకాశం ఉంది.
ఏడాదిగా వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేవారు… ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు. చివరికి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. రెండు వందల కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.