అనుకున్నదే అయింది. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ధియేటర్ యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు గతంలో ఉండేదని..ఈ ప్రభుత్వం తొలగించిందని కోర్టులో వాదించాయి. పదేళ్ల కిందటి నాటి టిక్కెట్ రేట్లను ఖరారు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వాదించారు.
అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఎందుకు రేట్లనుతగ్గిస్తూ జీవో జారీ చేయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పలేకపోయారు . దీంతో హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాత పద్దతిలో టిక్కెట్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గత ఏప్రిల్లో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో జారీ చేసింది. జీవో ప్రకారం… అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250. ఈ ధరలు ధియేటర్ల నిర్వహణకు కూడా రావని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
టిక్కెట్ రేట్లు పెంచాలని అదే పనిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. టాలీవుడ్లో వరుసగా బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పుష్ప , ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. వీటన్నింటికీ హైకోర్టు నిర్ణయం రిలీఫ్ కల్పించిందని అనుకోవచ్చు. హైకోర్టు జీవోను సస్పెండ్ చేయడంతో పాత విధానంలోనే టిక్కెట్ ధరలు ఉండనున్నాయి..