గంగోత్రి నుంచి… అల వైకుంఠపురములో వరకూ అల్లు అర్జున్‌లో ఎంతో మార్పు.
సినిమా సినిమాకీ తాను ఎదుగుతున్నాడు.
సినిమా సినిమాకీ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు.
అల వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డుల్ని సృష్టించాడు బన్నీ. ఇప్పుడు పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
* పుష్ప మీ కెరీర్‌లో ఓ సుదీర్ఘమైన ప్రయాణం. తొలి రోజు నుంచి… ఇప్పటి వరకూ ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?
– దాదాపు 24 నెలల ప్రయాణం ఇది. 2020 జనవరిలో అల వైకుంఠపురములో విడుదలైంది. ఆ తరవాత.. ఈ సినిమా వచ్చింది. మధ్యలో కొన్ని నెలలు కొవిడ్ తో నష్టపోయాం. కానీ… మా మైండ్ లో మాత్రం పుష్పకి సంబంధించిన ఆలోచనలు, కథలు తిరుగుతూనే ఉండేవి. కొవిడ్ సమయంలోనూ…దాదాపు ప్రతీరోజూ ఆన్ లైన్ లో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. ఈ సినిమాలో నేను చిత్తూరు యాసలో మాట్లాడా. దానికి సంబంధించిన కసరత్తులు కూడా లాన్ డౌన్ సమయంలోనే జరిగాయి.
* పుష్పలో మీరు… హీరోనా, విలనా? మీ పాతద్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయి?
– పుష్ప అనే వ్యక్తి జీవిత ప్రయాణం ఇది. అతని పాత్రలో అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. ఓ లారీ డ్రైవర్ నుంచి మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు? ఆక్రమంలో తన వేషధారణ, వస్త్రధారణ, అలంకరణ, హావ భావాలు ఎలా మారుతూ వచ్చాయి..? అనేది చూపించాం.
* పుష్ప కోసం ఎన్ని రకాల టైటిల్స్ అనుకున్నారు. పుష్ప నే ఫైనల్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?
– మేం అనుకున్న టైటిల్ ఇదొక్కటే. ఓరోజు సుకుమార్ వచ్చి… ఈ టైటిల్ చెప్పాడు. `బాగుంది…` అనేశాను. `నాకు తెలుసు. ఈ టైటిల్ నీకొక్కడికే నచ్చుతుంది. అందుకే ముందుగా నీకు చెప్పా` అన్నాడు. ఆ తరవాత.. దాన్ని పోస్టర్ తో సహా విడుదల చేయాలన్నది కూడా సుకుమార్ ఆలోచనే. ఎందుకంటే.. మా సినిమా పేరు పుష్ప అంటే.. ఒక్కసారిగా ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఇది అమ్మాయిల పేరు. ఎలా సూట్ అవుతుంది? అనే డౌటు వస్తుంది. రగ్గడ్ లుక్‌తో నా ఫస్ట్ లుక్.. దాని కింద.. పుష్ప అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనిపించింది. అందుకే అలా ప్లాన్ చేశాం.
* బన్నీ అంటేనే.. ప్రమోషన్లకు పెట్టింది పేరు. ఈ సినిమా ప్రమోషన్లన్నీ భారీగా జరుగుతాయి. కానీ.. పుష్ప విషయంలో అదేం కనిపించలేదని ఓ విమర్శ ఉంది..
– నిజమే. ఈ విషయంలో మా స్ట్రాటజీ కాస్త తప్పింది. పుష్ప ని మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే లెక్కగట్టాం. సాధారణంగా నెలరోజుల సమయం ఉంటే పోస్ట్ ప్రొడక్షన్స్‌కి సరిపోతుంది. కానీ.. పుష్పకి ఇంకా చాలా ఎక్కువ సమయంకావాలని ఆ తరవాత తెలిసింది. మొన్నటి వరకూ మేం షూటింగ్ చేస్తూనే ఉన్నాం. అందుకే ప్రమోషన్లకు సమయం దొరకలేదు. అయినా నా వంతు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. సినిమా విడుదలయ్యాక.. బాలీవుడ్ లో ప్రమోషన్లు గట్టిగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నా.
* పుష్ప షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన పార్ట్ ఏది?
– మారేడుమల్లి అడవుల్లో షూటింగ్ చేశాం. అక్కడ చాలా కష్టపడ్డాం. గుడెసె అనే పల్లెటూర్లో షూటింగ్ జరిగింది. అక్కడ రోడ్లు సరిగా లేవు. రెండు కిలోమీటర్ల మేర.. మేమే రోడ్డు వేసుకున్నాం. కానీ వర్షాలు పడితే.. ఆ రోడ్డు కొట్టుకుని వెళ్లిపోయేది. మళ్లీ రోడ్డు వేసేవాళ్లం. మా ప్రొడక్షన్స్ వాహనాలే దాదాపుగా 400 వరకూ ఉండేవి. రాత్రయితే.. దోమలు, చిన్న చిన్న పురుగులు. వర్షం పడితే.. షూటింగ్ ఆగిపోయేది.
* ఈ కథని రెండు భాగాలుగా చేయాలని మధ్యలో ఎందుకు అనుకున్నారు?
– సుకుమార్ పూర్తిగా స్క్కిప్టు చెప్పినప్పుడే ఇది పెద్ద కథ అనిపించింది. కానీ.. ఒకే సినిమాలో చెప్పేయొచ్చు అనే ధీమాతో మొదలు పెట్టాం. కానీ క్రమంగా… ఇంత పెద్ద కథని ఒకే సినిమాలో ఇరికించడం కష్టం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.
* పాన్ ఇండియా స్థాయిలో తీసిన సినిమా ఇది. ఆ మేరకు లెక్కలన్నీ కరెక్టుగా వేసుకున్నారా?
– నిజానికి పాన్ ఇండియా కథ చేయాలని పుష్ప చేయలేదు. పుష్పలో పాన్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి.. అది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకున్నాం. ఈ ఎమోషన్స్ మిగిలిన భాషల వాళ్లకీ కనెక్ట్ అవుతుందనిపించింది. బాహుబలి అయినా, కేజీఎఫ్ అయినా… ఇలానే మొదలెట్టి ఉంటారు. క్రమంగా అవి పాన్ ఇండియా సినిమాలు అయ్యాయి.
* బాహుబలి పార్ట్ 2 చూడడానికి కట్టప్ప ఎలిమెంట్ బాగా దోహదం చేసింది. అలాంటి ఎలిమెంట్ పుష్ప 1 నుంచి ఆశించొచ్చా?
– ఉన్నాయి… కానీ అవేంటన్నది ఇప్పుడే చెప్పను. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
* అలా వైకుంఠపురములో తరవాత మీరు.. రంగస్థలం తరవాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఏ మేరకు అందుకుంటారనిపిస్తోంది..?
– రంగస్థలం చేసేటప్పుడు… అది అంత పెద్ద హిట్ అవుతుందని సుకుమార్ అనుకుని ఉండడు. అల వైకుంఠపురములో చేస్తున్నప్పపుడు నేనూ అంతే. ఓ మంచి సినిమా, సరదాగా ఆడుతూ పాడుతూ చూసే సినిమా అయితే చాలు అనుకున్నా. కానీ… అవి రెండూ పెద్ద హిట్స్ అయిపోయాయి. పుష్ప కూడా అంతే. ఇదేదో రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుందని చేయలేదు. నిన్న కూడా సుకుమార్ తో మాట్లాడుతున్నప్పుడు `డార్లింగ్ ఇది హిట్ అయితే చాలు` అన్నాడు. ఓ బొమ్మ వేస్తే.. ఆర్టిస్టు హ్యాపీగా, సంతృప్తిగా ఫీల్ అవ్వాలి. దాన్ని ఎంత రేటుకు కొంటారో.. ఆ సమయంలో తనకి తెలీదు. సినిమా కూడా అంతే. దాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తారన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది.
* మిగిలిన భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్నారా?
– లేదు. ఒక్క తెలుగులోనే డబ్బింగ్ చెప్పా. తమిళంలో చెప్పొచ్చు. నాకు తమిళం కూడా వచ్చు. కానీ డబ్బింగ్ చెప్పే స్థాయిలో రాదు. ఓ సినిమాకి మన గొంతు సూటవ్వలేదంటే… సినిమా చూసే ప్రేక్షకులు మైండ్ డైవర్ట్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు.