స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ ను మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆదిలాబాద్ జిల్లా మినహా మెదక్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో పరిస్థితి దారుణంగా మారింది. హేమాహేమీల్ని కాదని అభ్యర్థిని నిర్ణయించడం.. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం వంటి కారణాలతో ఖమ్మంలో టీఆర్ఎస్కు ఉన్న ఓట్లు కన్నాతక్కువగా వచ్చాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 242 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు ఉన్న ప్రజాప్రతినిధుల ఓట్లు 116 మాత్రమే. సీపీఎం, సీపీఐతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసింది. వారి మద్దతు ఉంది. అయినప్పటికీ టీఆర్ఎస్ వైపు ఉన్నవారు సైతం సొంత అభ్యర్థికి ఓటు వేయలేదు. 15 నుంచి 20 రోజులు క్యాంపులకు తీసుకెళ్లినప్పటికీ ఇతరులకు ఓటు వేసినట్లు స్పష్టమైంది.
కరీంనగర్ లో మొత్తం1324 ఓట్లు ఉండగా 986 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవి. అయితే టీఆర్ఎస్ కు చెందిన భాను ప్రసాద్ కు 585, ఎల్. రమణకు 479 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు సైతం 231 ఓట్లు వచ్చాయి. నల్లగొండలో టీఆర్ఎస్ కు చెందిన 54 ఓట్లు అధికార పార్టీకి పడలేదు. పోలింగ్ మరో రెండ్రోజులు ఉండగా కొంతమంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు. అయినప్పటికీ ఓట్లు తక్కువ వచ్చాయి. మెదక్ లో టీఆర్ఎస్ కు 777 ఓట్లు ఉండగా 762 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు తగ్గాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 554 ఓట్లు, ఉండగా 742ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలకు చెందిన వారు సైతం టీఆర్ఎస్ కు ఓటు వేశారు.