స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం అంటూ సీఐడీ నమోద చేసిన కేసు ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆహ్వానంతో రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా సేవలు చేసిన గంటా సుబ్బారావును అరెస్ట్ చేసిన వైనం ఇప్పుడు అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు కూడా ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో అలజడి రేపుతున్నాయి.
స్కిల్ డెలవప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ చెబుతున్న దానికి… గంటా సుబ్బారావు, మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణకు ఎలాంటి సంబంధం లేదని.. ఒప్పందాల ఖరారులో కానీ.. నిధుల విడుదలలో కానీ వారిది సాక్షి పాత్రేనని చెబుతున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి కాగా.. కేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. రిపోర్టులు ఇచ్చి.. ఒప్పందం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం సీఎం కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్‌లు. ఇప్పుడు హైకోర్టు ఈ కేసులో సెలక్టివ్‌గా వారిని మాత్రమే ఎందుకు నిందితులుగా మార్చారో చెప్పాలని ఆదేశింది.
స్కాంకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. వారి తప్పు లేదని సీఐడీ సర్టిఫై చేస్తే ఓ అనుమానం బలపడుతుంది.. వారి పాత్ర కూడా ఉందని చెబితే.. వారినీ అరెస్ట్ చేయక తప్పదు. వారి తప్పు లేదని చెబితే… నిందితులుగా చూపిన వారి తప్పును నిరూపించాలి. ఎలాంటి అధికారిక నిర్ణయాలు.. సంతకాలు లేని వారిని నిందితులుగా వారి తప్పును నిరూపించడం అసాధ్యం. అంతే కాదు.. వారు ఈ కేసులో ఏ విధంగా అయినా ఒక్క రూపాయి లబ్ది పొందారా అన్నదానిపైనా ఎలాంటి వివరాలూ సీఐడీ పొందుపర్చలేదు. అంటే అవినీతి జరిగిందని చెప్పడానికి లేదు.అలాంటి చాన్స్ లేదు కాబట్టే దుర్వినియోగం అనే పదం సీఐడీ వాడుతున్నట్లుగా న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎలా చూసినా ఇప్పుడు ఓ కేసులో కొంత మందిని సెలక్టివ్‌గా పక్కన పెట్టి క్లీన్ చిట్ ఇవ్వడం సాధ్యం కాదని.. మొత్తంగా తాము టార్గెట్ చేయాలనుకున్న వారి కోసం.. సన్నిహితుల్ని కూడా బుక్ చేయడానికి ప్రభుత్వ పెద్దలు వెనుకాడరన్న అభిప్రాయం ఈ కేసులో ప్రభుత్వ ఉన్నతాధికవర్గాల్లో ఏర్పడుతోంది.