తెలంగాణ ఇక ఎలాంటి చిన్న చిన్న ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక వచ్చేది పూర్తి స్థాయి అసెంబ్లీ ఎన్నికలే. షెడ్యూల్ ప్రకారం 2023 చివరిలో జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఓ ఏడాది త్యాగం చేసి.. మరో ఐదేళ్లు ఎక్స్ టెన్షన్ పొందేందుకు వచ్చే ఏడాది చివరిలో ముందస్తుకు వెళ్తారన్న గట్టి అంచనాల్లో తెలంగాణ రాజకీయవర్గాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన దళిత బంధు పథకం అమలు.. ఇతర వ్యవహారాలను ఖచ్చితంగా వచ్చేఏడాది ఆగస్టులోపు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులూ ఆ లోపు కొలిక్కి తెస్తున్నారు.
కేసీఆర్ శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముందస్తుపై ఆయన ఈ సమావేశంలో ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవచ్చు కానీ.. రాజకీయంగా క్రియాశీలం కావాలని తప్పక ఆదేశిస్తారని దాన్నే సూచనగా భావించాలని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వస్తున్నాయి. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించనున్నారు. దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో వంద శాతం అమలు చేస్తారు. వచ్చే మార్చికల్లా అన్ని నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తాకుయ
ఇక ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాకలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అచ్చంపేట నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఉమామహేశ్వర లిఫ్టు, రిజర్వాయర్‌కు శంఖుస్థాపన చేయనున్నారు. జనగాం జిల్లాలో ఈ నెల 20న పర్యటించనున్నారు. ఆ తర్వాత పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఈ తీరిక లేని పర్యటనలు… ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పటి వరకూ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.