వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హఠాత్తుగా బ్రేక్ పడింది. ఏమయ్యారు సీబీఐ వాళ్లు అని అనుకునేలోపు మళ్లీ తిరిగి వచ్చారు. బుధవారం పులివెందులలో భరత్ యాదవ్ అనే స్వయం ప్రకటిత జర్నలిస్టును పిలిచి ప్రశ్నించారు. ఈ భరత్ యాదవ్ గతంలో సీబీఐకి కీలక విషయాలు చెబుతూ లేఖ రాశానని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని నిర్ణయించారు. అవినాష్ ప్రధాన అనుచరుడు శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా వైఎస్ సునీత్, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చిన వారిలో మొదటి వ్యక్తి.
ఆ తర్వాత మరికొంత మంది వచ్చారు. ఇప్పుడు వారందర్నీ ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి తీసుకుని నాలుగు రోజులకే మళ్లీ కోర్టుకు సరెండర్ చేసిన సీబీఐ ఆ తర్వాత ఆయనను కోర్టు అనుమతి లేకుండానే ఆస్పత్రికి తరలించినా పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేసిన వారిని ప్రశ్నించి.. ఆధారాలు సేకరించే పనిలోకి దిగారు. సీబీఐ పైనా ఆరోపణలు చేశారు. వాటి గురించీ సీబీఐ నిగ్గు తేల్చాల్సి ఉంది.
మరో వైపు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. మొత్తంగా చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒకటైతే.. ఇక ముందు జరగనున్న విచారణ మరొకటని అనుకోవచ్చు. కీలక మలుపులు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి.