‘పుష్ఫ’ 2 భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ సినిమాని రెండు భాగాలుగా చేయాలన్న నిర్ణయం… కాస్త లేట్ గా తీసుకున్నారు. షూటింగ్ మొదలైన నెల రోజుల తరవాత.. ఇంత పెద్ద కథని ఒకే సినిమాగా చెప్పలేం అనిపించి, పార్ట్ 2 గా మలిచారు. ఎప్పుడైతే రెండు భాగాలుగా తీసుకురావాలని అనుకున్నారో, అప్పుడే కొన్ని కొత్త సన్నివేశాలు కావాల్సివచ్చింది. అందులో భాగంగా పుష్పలో ప్రేమకథని జోడించారు.
నిజానికి సుకుమార్ రాసుకున్న కథ ప్రకారం… శ్రీవల్లి- పుష్ఫలకు ముందే పెళ్లయిపోతుంది. ఈ పెళ్లి ఇటు పుష్పకీ, అటు శ్రీవల్లికీ ఇష్టం ఉండదు. ఇష్టం లేకుండా.. వాళ్లు కాపురం ఎలా చేశారో చూపిస్తూ… వాళ్లమధ్య ఓ లవ్ స్టోరీ నడిపాడట సుకుమార్. పార్ట్ 2 అనే ఆలోచన వచ్చింది కాబట్టి, కొత్త సన్నివేశాలు అవసరం అయ్యాయి కాబట్టి.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని మార్చుకుని పుష్ప శ్రీవల్లిల మధ్య ప్రేమకథ సృష్టించాడు సుకుమార్. లవ్‌స్టోరీలు నడపడంలో సుకుమార్ దిట్ట. ఈసారి కూడా అలాంటి వెరైటీ కాన్సెప్టుతోనే ఈ ప్రేమకథ నడిపాడట. అందులోనే కావల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా పండిందని సమాచారం.