బీహార్‌కు ప్రత్యేకహోదా ప్రకటించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. బీహార్ గత పదేళ్లలో బాగా అభివృద్ధి చెందిన ఇంకా ప్రత్యేకహోదా అవసరమేనని ఆయన అంటున్నారు.ఈ అంశంపై సీరియస్‌గా పరిశీలిస్తున్నామని చెప్పుకచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను మళ్లీ వినిపించడం ప్రారంభించారు. మూడు రోజుల కిందట ఆయన నీతి ఆయోగ్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నా… అనుకున్న విధంగా రాష్ట్రం పుంజుకోలేకపోయిందని ప్రత్యేకహోదా ఉంటేనే పుంజుకుంటామని లేఖ రాశారు.
బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ప్రత్యేకహోదా అనే అంశం ముగిసిపోయిన అధ్యాయమని దేశంలో ఇక ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని స్వయంగా పార్లమెంట్లో అప్పటి ప్రధాని హామీ ఇచ్చినా నెరవేరలేదు. అదే సమయంలో బీహార్‌కు ప్రత్యేకహోదా కోసం పదేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం బీహార్‌కే కాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. వివిధ రకాల కారణాలు చెప్పి.. హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పటికీ పార్లమెంట్లో ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం నిర్మోహమాటంగా చెబుతూ ఉంటుంది.
బీహార్‌లో కదిలిన ప్రత్యేకహోదా అంశం ఏపీలోనూ కలకలంరేపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా అంశాన్ని అడుగుతూనే ఉంటామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ సర్కార్ .. ఇంత వరకూ ప్లీజ్ ప్లీజ్ అంటూనే ఉందికానీ.. గట్టిగా అడిగే ప్రయత్నంచేయలేదు. కానీ మిత్రపక్షంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నితీష్ ప్రశ్నించడంతో సహజంగానే ఏపీ సీఎం జగన్ పైనా ఒత్తిడి పెరుగుతుంది. అయితే సహజంగా ఆయన ఇలాంటివి పట్టించుకోరు. ఎవరేమన్నా లైట్ తీసుకుంటారు.