వైఎస్ఆర్సీపీ నేతలు రాయలసీమ మేధావుల ఫోరం పేరుతో మూడు రాజధానుల ర్యాలీలు నిర్వహిస్తూ విద్యార్థులను పోగేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల కాలేజీల నుంచి ర్యాలీలకు విద్యార్థులను తీసుకొస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాల్లో వారు చాలా చోట్ల ఫెయిలవుతున్నారు. ర్యాలీ మంచి టెంపోగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో నిర్వాహకులు కంగారు పడే పరిస్థితి వచ్చింది. హిందూపురంలో మూడు రాజధానులపేరుతో వైసీపీ నేతలు నిర్వహించిన ర్యాలీలో జై బాలయ్య నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రోజు తిరుపతిలోనూ అదే పరిస్థితి కనిపించింది.
శుక్రవారం అమరావతి రైతులు బహిరంగసభ నిర్వహిస్తున్న సమయంలో రాయలసీమ మేధావుల ఫోరం పేరుతో నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ సీరియస్గా సాగుతున్న సమయంలో జై బాలయ్య నినాదాలతో ఓ మూల హోరెత్తిపోయింది. ఇంకో మూల జై జనసేన పేరుతో దుమ్మురేపారు. వాళ్లను కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చాలా చోట్ల విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. బలవంతంగా మూడు రాజధానుల ర్యాలీకి తీసుకు వచ్చారని.. తమకు ఒకే రాజధాని.. అదీ కూడా అమరావతే ఉండాలని నేరుగా చెప్పారు.
దీంతో ర్యాలీ అంతా రాజకీయ ప్రేరేపితం అని తేలిపోయిందన్న సెటైర్లు పడ్డాయి. మొత్తంగా చూస్తే శనివారం పోటీ సభ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారన్న అభిప్రాయం అధికార పార్టీ నేతల ప్రకటనలతో స్పష్టమవుతోంది. ఈ కారణంగా ముందు ముందు మూడు రాజధానుల అంశం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ అస్త్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.