ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు గురువారం రెండు బస్సుల్లో తాడేపల్లికి వచ్చారు. అయితే వారికి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. ముఖ్యమంత్రి జగన్ అత్యంత బిజీగా ఉన్నారని .. ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లను కలిసే పరిస్థితి లేదని.. శుక్రవారం కలవొచ్చని చెప్పి పంపించారు. నిజానికి ఐపీఎస్ అధికారులు కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేకుండా వస్తారా అన్నది ఓ సందేహం కాగా.. అంత హఠాత్తుగా రెండు బస్సుల్లో రావడానికి కారణం ఏమిటన్నది చాలా మందికి అంతుబట్టకుండా ఉంది.
ఐపీఎస్ అధికారులంతా సీఎం నివాసానికి రావడానికి ముందు విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఆ తర్వాతే సీఎం జగన్ను కలవడానికి వచ్చారు. మామూలుగా అయితే ఐపీఎస్ అధికారులంతా ఇలా సమావేశం అవడం అరుదు. ఒక వేళ ఏదైనా రీట్రీట్ పేరుతో పార్టీ పెట్టుకుని.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా కబుర్లు చెప్పుకోవాలనుకున్నా.. వీకెండ్లలో ప్లాన్ చేసుకుంటారు. కానీ వీక్ డేస్లో పెట్టుకోరు. అలా పెట్టుకుని… ఆ తర్వాత రెండు బస్సులు మాట్లాడుకుని జగన్ ఇంటి వద్దకు రావడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
వారంతా సీఎం జగన్ ఎందుకు కలవాలనుకున్నారో.. ఏం సమస్యలు చెప్పాలనుకున్నారో ఉన్నాతాధికారులకు కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. వైసీపీ పాలనలో ఐపీఎస్ అధికారులు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా కీలక పొజిషన్లలో ఉన్న ప్రతి ఒక్కరూ నిబంధనలు ఉల్లంఘించి .. కక్ష సాధింపు చర్యల కోసం ఉపయోగపడ్డారనే ఆరోపణల ఉన్నాయి. ప్రభుత్వం మారిదే వారందరూ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. ఇలాంటి సమయంలో అందరూ బస్సుల్లో జగన్ ఇంటికి రావడం ఆశ్చర్యకరంగా ఉంది. శుక్రవారం వారితో జగన్ సమావేశమైతేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.