ప్రస్తుతం హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్ సామాజిక వర్గం చేస్తున్న విద్వంసకర ఉద్యమాన్ని చూస్తుంటే, ఇటీవల ఆంధ్రాలో కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన ఉద్యమం గుర్తుకు రాకమానదు. కాపుల ఉద్యమ సందర్భంగా తునిలో కొంత విద్వంసం జరిగినప్పటికీ ముద్రగడ, అలాగే ప్రభుత్వం కూడా చాలా విజ్ఞత, పట్టువిడుపులు ప్రదర్శించి రాజీ పడటంతో హర్యానా వంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించగలిగారు. కానీ హర్యానాలో ఉద్యమకారులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడంపై కంటే విద్వంసం సృష్టించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లుంది. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు రావడం లేదు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరగనప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏవిధంగా జరుగుతుందని ఉద్యమకారులు ఆశిస్తున్నారో తెలియదు. తమను బీసీలలో చేర్చుతూ ప్రభుత్వం తక్షణమే ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని మొండిపట్టు పడుతున్నారు. కానీ అదే సాధ్యమయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పుడో అదే పని చేసి ఉండేది కదా? సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడంలో అటు హర్యానా ప్రభుత్వం, జాట్ ఉద్యమకారులు కూడా విఫలమయినట్లే ఉన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రమయిన హర్యానాకి కేంద్రం పూర్తి సహాయసహకారాలు అందజేస్తున్నా కూడా పరిస్థితులను అదుపు చేయలేకపోతోంది. ఉద్యమం నానాటికీ ఉదృతరూపం దాల్చుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా సంబంధిత ఉద్యమకారులతో చర్చలు జరుపలేకపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపులకు రిజర్వేషన్ల విషయంలో మొదట కొంచెం అలసత్వం ప్రదర్శించినప్పటికీ ముద్రగడ ఉద్యమం ఆరంభించడానికి సిద్దం అవుతున్నట్లు గ్రహించగానే చాలా చురుకుగా వ్యవహరించింది. తుని సభ తరువాత జరిగిన విద్వంసాన్ని ప్రభుత్వం నివారించలేకపోయినా, ఆ తరువాత మళ్ళీ అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంది. హర్యానా ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుకుగా, సమర్ధంగా స్పందించి పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడిందని హర్యానాలో పరిస్థితులను చూస్తుంటే అర్ధం అవుతోంది.
ఆంధ్రాలో అటు కాపులు, ప్రభుత్వం ఇరు వర్గాలు కూడా గౌరవప్రదంగా సంధి జరుపుకొని అందరి మన్ననలు పొందితే, హర్యానాలో జాట్ లు ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించకుండా విధ్వంసానికి పాల్పడుతూ తమ ఉద్యమానికి కళంకం ఆపాదించుకొంటున్నారు. కనుక హర్యానా ప్రభుత్వంతో పోల్చిచూసుకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే జాట్ లతో పోల్చితే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ప్రజలు చాలా చాలా విజ్ఞతతో, సంయమనంతో వ్యహవరించారని చెప్పవచ్చు.