మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, నీడ. ఈ మూడు నిత్యావసరాల కిందకే వస్తాయి. రూ. ఐదు లక్షల కన్నా ఎక్కవ సంపాదిస్తే ఆదాయపు పన్ను.. సంపాదించినా.. సంపాదించకపోయినా పెట్రోల్, డీజిల్, పరోక్ష పన్నులతో మధ్య తరగతిని పీల్చి పిప్పి చేస్తున్న కేంద్రం… తాజాగా మరో వడ్డింపు రంగంలోకి తీసుకు వచ్చింది. ప్రజలు కొనుక్కునే దుస్తుల మీద పన్నెండు శాతం జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే.. రూ. వెయ్యి పెట్టి బట్టలు కొనుక్కుంటే ప్రభుత్వానికి రూ. 120 టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
అంటే రూ. పదకొండు వందల ఇరవై . ఇప్పటి వరకూ ప్రజలకు దుస్తులు నిత్యావసరంగానే గుర్తించి ఐదు శాతం పన్ను వసూలు చేస్తున్నారు. జనవరి ఒకటి నుంచి పన్నెండు శాతానికి పెంచుతున్నారు. దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు పేదరికంలోకి జారిపోయారన్న నివేదికలు ఉన్నాయి. కరోనా కారణం.. ప్రభుత్వ విధానాల కారణంగా అనేక మంది ఉపాధి గల్లంతయిందని రిపోర్టులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా.. ప్రజలకు రోజువారీ జీవితంలో అవసరమైన వాటిపై పన్నుల వడ్డింపు పెంచుకుంటూ పోతున్నారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లుద ద్రవ్యోల్బణాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. తినే తిండి సహా అన్ని రకాల రోజు వారీ కార్యకలాపాల్లో వ్యయం పెరిగిపోయింది. అయినా కేంద్రం కనికరించడం లేదు. రూ. లక్షల కోట్లను పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేసుకుని అదే అభివృద్ధిగా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.