పార్టీ లేదా పుష్పా….. పుష్ప ట్రైలర్లో ఫహద్ ఫాజిల్ చెప్పిన ఈ డైలాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని రకరకాలుగా మీమర్స్ వాడుకుంటున్నారు. పుష్ప విడుదలయ్యాక… పార్టీ లేదా పుష్పా కాస్తా.. పార్ట్ 2 లేదా పుష్పా గా మారిపోయింది.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న పుష్ప భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 అంచనాలను అందుకోకపోవడంతో.. పార్ట్ 2 ఉందా, లేదా అంటూ… కౌంటర్లు వేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం `పార్ట్ 2 లేదా పుష్పా` అనే కౌంటర్ ట్రెండింగ్ లో ఉంది. పార్ట్ 1 కి నెగిటీవ్ టాక్ రావడం కచ్చితంగా పార్ట్ 2పై ఒత్తిడిని పెంచే సంగతే. నిజానికి పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కొంత మాత్రమే అయ్యింది. చాలా బాకీ ఉంది. దాంతో పార్ట్ 2 ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. బన్నీ కోసం బోయపాటి శ్రీను రెడీ గా ఉన్నాడు. తనకు బన్నీ కాల్షీట్లు ఇస్తే.. పార్ట్ 2 ఆలస్యమవుతుంది. పార్ట్ 1కి ఉన్న క్రేజ్ పార్ట్ 2కి ఉండదు కాబట్టి.. ఆ సినిమా మీమాంశలో పడుతుంది.
కానీ.. బన్నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పార్ట్ 2కి అంత సమయం ఇవ్వకుండా.. వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నాడట. సుకుమార్‌కి ఓ టార్గెట్ ఇచ్చి, ఆ సమయంలోగా షూటింగ్ పూర్తి చేయించాలని అనుకుంటున్నాడు బన్నీ. పుష్ప ఈనెల 17న విడుదల అయ్యిందంటే… సుక్కుని ఇలా పరుగులు పెట్టించడమే కారణం. పుష్ప పార్ట్ 2 ఉంటుంది. కాకపోతే… సుక్కు చేతిలోనే టైమ్ లేదు. తన స్వభావానికి విరుద్ధంగా ఈ సినిమాని చక చక పూర్తి చేయాల్సి ఉంటుంది.