భారతీయ జనతా పార్టీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షాలు ఏమిటి అనే ప్రశ్న వస్తే రాజకీయ పరంగా ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే బీజేపీని నమ్ముతున్న పార్టీలేవీ ఇప్పుడు లేవు. కానీ బీజేపీని వ్యతిరేకించే పార్టీల వద్ద మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఉంటుంది.. అదే ఐటీ, ఈడీ, సీబీఐ. ఈ మూడు దర్యాప్తు సంస్థలు బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఎవరు బీజేపీని వ్య.తిరేకిస్తారో వారిని టార్గెట్ చేయడం.. వారు బీజేపీకి అనుకూలం అయితే సైలెంటయిపోవడం జరుగుతోంది. కొన్ని వందల మంది నేతలు ఈ మూడు దర్యాప్తు సంస్థల కేసుల బాధలు పడలేకే బీజేపీలో చేరిపోయారు. ఎన్నికలు వస్తున్నాంటే ఆ రాష్ట్రాల్లోనూ ఈ మూడు సంస్థల కదలికలు ఎక్కువగా ఉంటాయి.
బెంగాల్లో ఎన్నికలకు ముందు ఎంత రచ్చ చేశారో అందరూ చూశారు. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. యూపీలో బీజేపీకి దడ పుట్టిస్తున్న అఖిలేష్ను టార్గెట్ చేసుకుని ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్, ఆర్సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్ , లక్నో జైనేంద్ర యాదవ్ నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరంతా అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితులే. ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి వీరంతా ఆర్థికంగా అండదండలు అందించే అవకాశం ఉందన్న ప్రచారం ఉన్న వారే.
ఈ దాడులపై అఖిలేష్ యాదవ్ భిన్నంగా స్పందించారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటోందని.. ఇప్పుడు ఐటీ అధికారులు మాత్రమే వచ్చారు.. ఇక ముందు ఈడీ, సీబీఐ అధికారులు కూడా వస్తారని.. వారి కోసం వెయిట్ చేస్తున్నామని సెటైర్లు వేశారు. దేనికీ తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ దర్యాప్తు సంస్థలను అత్యంత దారుణంగా రాజకీయాల కోసం వాడుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అది శ్రుతి మించితే దాడులకు గురైన వారికే ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.