కాపు రిజర్వేషన్లను సమర్థించడం ద్వారా లాభమే జరగవచ్చు గాక. కానీ రిజర్వేషన్ అంటూ అమల్లోకి వస్తే.. దాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుకే ఎక్కువ మైలేజీ వస్తుంది తప్ప.. సమర్థించిన జగన్కు కాదనేది ఎవరైనా అంచనా వేయగలరు! అలాగని ఆ రిజర్వేషన్ను వ్యతిరేకించక్కర్లేదు.. కానీ కమిషన్ లేకుండా.. తక్షణం రిజర్వేషన్ తెచ్చేయాలని.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆచరణ సాధ్యం కాని రిజర్వేషన్ కోటా పెంచాలని ఇలా రకరకాలుగా మాట్లాడడం వలన.. బీసీల్లో జగన్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. కాపు ఓట్ల మీది వెంపర్లాటలో బీసీలను విస్మరిస్తున్నాడనే అభిప్రాయం కలుగుతుంది కదా. ఇది ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకుల సందేహం. ఈ మేరకు, వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన సొంత పార్టీలోని బీసీ నాయకులు ఒక రేంజిలో క్లాస్ తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
తాజాగా వైఎస్ జగన్ తన పార్టీలోని బీసీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావ, జంగాకృష్ణమూర్తి తదితరులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా తమ పార్టీ ప్రదర్శిస్తున్న ‘ఎక్స్ట్రా’ ఉత్సాహం నష్టం కలిగిస్తుందేమో అనే అభిప్రాయాన్ని ఈ నేతలు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కాపుల్ని దూరం చేసుకోవాలనడం తమ ఉద్దేశం కాదు గానీ.. వారు తప్ప తమకెవ్వరూ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించడం బీసీలను దూరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారుట.
దాంతో జగన్ కూడా బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ అమల్లోకి తేవడమే తన ఉద్దేశం అని.. మన పార్టీ లక్ష్యం అదే అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి సూచించారుట. చంద్రబాబు కూడా తొలినుంచి ఇదే మాట చెబుతూనే వస్త్తున్నారు. జగన్ చెబుతున్నట్లుగా రిజర్వేషన్లతో జీవో ఇచ్చేస్తే.. దాన్ని కోర్టు కొట్టేస్తుందని, కమిషన్ ద్వారా సరైన సిఫారసులు వచ్చాకే తీసుకురావడం కరెక్టు అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇన్నాళ్లూ ఇది చంద్రబాబు వంచన అంటూ వచ్చిన జగన్.. చివరికి తాను కూడా అదే పాట పాడడం విశేషం. ముద్రగడ పద్మనాభం దీక్ష కూడా చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోయిన నేపథ్యంలో ఇక ఈ విషయంలో ఎక్కువ స్పందించకుండా.. ప్రస్తుతానికి పార్టీకి ఉన్న ఆదరణలో కుల సమీకరణాలు మారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేచాలునని నాయకులు జగన్కు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.