తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు .. కీలక నేతలు ఢిల్లీ బాట పట్టారు. శనివారమే కొంత మంది వెళ్లగా .. ఆదివారం మరికొంత మంది వెళ్లారు. వీరు మళ్లీ ఎందుకు ఢిల్లీ వెళ్లారంటే.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత తీసుకోవడం కోసమట. కేంద్రం తాను చెప్పాల్సిన విషయాన్ని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రభుత్వమే ఎలాంటి బియ్యం ఇవ్వబోమని లేఖ ఇచ్చిందని ఓ లేఖను పీయూష్ గోయాల్ పార్లమెంట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ లేఖపై వివాదం నడుస్తోంది. మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నాని కేసీఆర్ నేరుగా చెప్పారు.
మెడ మీద కత్తి పెట్టారో లేదో కానీ.. మొత్తానికి లేఖ అయితే ఇచ్చింది నిజమే కదా అని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. మెడ మీద కత్తి అంటే ఏమిటి ఈడీ విచారణా అనిప్రశ్నిస్తున్నారు. అయితే ఎందుకు లేఖ ఇవ్వాల్సి వచ్చిందో మాత్రం ఇంత వరకూ టీఆర్ఎస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మరో విడత మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించారు. మొదట ఓ సారి మంత్రుల బృందం వెళ్లింది.. తర్వాత స్వయంగా కేసీఆర్ వెళ్లారు.. కానీ ఎవర్నీ కలవలేదు.
ఇప్పుడు మళ్లీ మంత్రుల బృందాన్ని పంపారు. అయిసే శని, ఆదివారాల్లో ఢిల్లీలో ఎవరూ ఉండరని తెలిసి కూడా .. ఎందుకు పంపారనేది చాలా మందికి అర్థం కాని విషయం. మెడీ అపాయింట్మెంట్ తీసుకుని.. అందరూ ఒక్కే సారే ఢిల్లీ వెళ్లొచ్చుగా అని కొంత మందికి డౌట్ వస్తోంది. అయితే ధాన్యం పేరుతో ఢిల్లీలో కేసీఆర్ ఇంకేదో రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం ఢిల్లీలో బలంగా ఉంది. అదేమిటన్నది తేలాల్సి ఉంది.