బీజేపీపై ఇక పోరాటమే అని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు కాస్త రిజర్వేషన్లు పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ, కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేయాలని .. ఊరూరా చావు డబ్బు కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన… తాను మాత్రం ఎక్కడా నిరసనల్లో పాల్గొనడం లేదు. కేసీఆర్ మాత్రమే కాదు…కేటీఆర్, కవిత కూడా ఇలాంటి నిరసనల్లో పాల్గొనడం లేదు. ఇప్పటి వరకూ అలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. పైగా హైదరాబాద్‌లో అలాంటి నిరసనలు వద్దని నేరుగానే చెప్పేశారు.
గ్రేటర్ పరిధిలో ఎక్కడా వరి పండించడం లేదు కాబట్టి.. నిరసనలు అక్కర్లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రులు.. సీఎం పాల్గొననున్న క్రిస్మిస్ వేడుకల ఏర్పాట్లను పరిశీలించడమే నేడు షెడ్యూల్‌గా పెట్టుకున్నారు. కేసీఆర్ ఇక .. కేంద్రం సంగతి చూస్తామని పిలుపునిచ్చి.. ఇప్పటికి మూడో సారి తెలంగాణలోనే నిరసనలు నిర్వహిస్తున్నారు. కానీ.. ఢిల్లీలో అగ్గిపుట్టిస్తామన్న ప్రయత్నాలు కనీసం చేయలేదు. మంత్రుల్ని మాత్రం ఢిల్లీకి పంపుతున్నారు. ఈ అంశంలో అసలేం జరుగుతుందో టీఆర్ఎస్ క్యాడర్‌కూ అర్థం కావడం లేదు.
తమకు పిలుపునిచ్చి పార్టీ ముఖ్య నేతలే పట్టించుకోకపోతే.. తామెందుకు సీరియస్‌గా తీసుకోవాలన్న అభిప్రాయంలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఈ కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈ సారి నిరసనలు పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ముందు ముందు బీజేపీపై పోరాటం అని కేసీఆర్ ప్రకటనలు ఇచ్చినా క్యాడర్ అంతా లైట్ తీసుకునే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… పిలుపునివ్వడమే కాదు.. స్వయంగా కేసీఆర్, కేటీఆర్, కవిత లాంటి వాళ్లు కూడా రంగంలోకి దిగి నిరసనలు చేపడితేనే విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.