ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు మొత్తం తామే అమ్మాలని చట్టం చేసింది. కొద్ది రోజుల కిందట జీవో జారీ చేసింది. అది ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆ జీవోలో చాలా రోజులుగా చెబుతున్నట్లుగా టిక్కెట్ల అమ్మకం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎపీఎస్ఎఫ్డీసీ ద్వారా మాత్రమే అమ్మాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకుని చాలా రోజులు అవుతోంది. కానీ ఇప్పటి వరకూ ఆ పోర్టల్ కానీ.. యాప్ కానీ సిద్ధం చేయలేదు. కానీ.. మొత్తం టిక్కెట్లు ఇక ప్రభుత్వం ద్వారా అమ్మాలనే జీవో మాత్రం తెచ్చారు. నిజానికి ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
టిక్కెట్లు అన్నీ ప్రభుత్వం అమ్మితే.. ఇక ధియేటర్లలో అమ్మరా..? ధియేటర్లలో టిక్కెట్ కౌంటర్లు ఉండవా..? కొంటే ఆన్లైన్లోనే కొనాలా..? ఒక వేళ వాక్ ఇన్ టిక్కెట్ కౌంటర్లు ఉంటే అందులో ఉద్యోగుల్ని ప్రభుత్వం పెడుతుందా..? ధియేటర్ల యజమానులు పెట్టుకోవాలా..? రోజువారీ కలెక్షన్లు ఎప్పుడు జమ చేస్తారు..? జమ చేయకపోతే ఎవర్ని అడగాలి..? ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం జీవోలో చూపించాల్సి ఉంది. కానీ అసలు పోర్టల్ రెడీ కాలేదు కానీ జీవో ఇచ్చేశారు. ప్రభుత్వం ఏదో చేయాలని అనుకుంది.. గబగబా చేసేసింది. తమకు అధికారం ఉందని.. చేసేసింది.
కానీ దీని వల్ల ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యలను మాత్రం ఇంత వరకూ పరిష్కరించించే ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయం మాత్రం అటు ఇండస్ట్రీ వర్గాలు.. ఇటు ధియేటర్ల నుంచీ వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భారీ సినిమాలు విడుదలవుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి జీవోలు తెచ్చి.. ఓ రకంగా టాలీవుడ్లో ఉన్న ప్రతీ వ్యవస్థను.. భయపెడుతోందని.. బ్లాక్ మెయిల్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రూ. వందల కోట్లతో వ్యాపారం చేస్తున్న టాలీవుడ్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ వారి బాధలను మాత్రం ప్రభుత్వం ఆలకించడం లేదు.