సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్న విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇస్తోంది. సీబీఐకి మరిన్ని అధికారులు కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని అనుకుంంటోంది. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఏర్పాటు చేసిందని, దాని పరిధి ఢిల్లీ భూభాగం వరకే ఉంటుంది. ఢిల్లీ కాకుండా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన పని నిర్వర్తించాలంటే ఆ రాష్ట్రం జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ జనరల్ కన్సెంట్ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. అన్ని రాష్ట్రాలూ ఇస్తూ వస్తున్నాయి.
అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడైతే.. సీబీఐని మిత్రపక్షంగా మార్చుకుని.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడటానికి ఉపయోగించుకుంటున్నాయో.. అప్పటి నుంచే సమస్య వస్తోంది. కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో తమకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే.. వారిపైనా.. సీబీఐతో దాడులు చేయించడం పరిపాటిగా మారింది. తమతో విబేధిస్తే ఇక సీబీఐ అధికారుల దాడులే అని బీజేపీ నేతలు బహిరంగంగా హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ను రద్దు చేశాయి. జగన్ సీఎం అయ్యాక.. మళ్లీ జనరల్ కన్సెంట్ను ఇచ్చారు.
బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నందున.. తమ జోలికి రాదని వైసీపీ నమ్మకం కావొచ్చు.అలాంటి నమ్మకం లేని ప్రభుత్వాలు ఇంకా జనరల్ కన్సెంట్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలో వారిచ్చేదేమిటి.. తామే తీసుకోవాలన్న ఉద్దేశంతో సీబీఐ అధికారాల్ని మరింత విస్తృత పరచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి చట్టం చేయనున్నారు. అంటే ఇక రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ అన్నికేసులూ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట.