ప్రభుత్వ పథకం అంటే.. డబ్బులు ఇస్తారు.. ఈ ప్రభుత్వంలో అయితే మీట నొక్కి నగదు బదిలీ చేస్తారు. దాన్నే పథకం అంటారు. కానీ ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ.. దానికీ ఓ పథకం పేరు పెట్టడం… అది అమలు చేస్తున్నామని ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం … భారీ బహిరంగసభ పెట్టడం..అనూహ్యం. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఓటీఎస్ పేరుతో … గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టించుకుని రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం బయలుదేరింది. డబ్బులు కట్టించుకుని రుణాన్ని మాఫీ చేయడం ఏమిటో అర్థం కాక సామన్యులు ఇప్పటికే ఇదైపోతున్నారు. ప్రభుత్వం అడుగుతున్న సొమ్మును ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో తెలియక సతమతవుతున్నారు.
ఈ హడావుడి ఇలా ఉంటే.. మీకు లక్షలకు లక్షలు మేలు చేస్తున్నామంటూ చేస్తున్న ప్రచారం కూడా సామాన్యుల్ని మరింత వేదనకు గురి చేస్తోంది. తమ ఆస్తిని తమకు ఇస్తామంటూ చేస్తున్న హడావుడే వారికి అర్థం కావడం లేదు. ఇదంతా గందరోగళంగా ఉంది. ఈ హడావుడి ఇలా ఉండగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తన పుట్టినరోజు నాడే ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకున్నారు. తణుకులో ప్రారంభిస్తున్నారు. సహజంగా బటన్ నొక్కి డబ్బులు వేసే ప్రోగ్రాంకు ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తారు. ఇచ్చేది.. రూ. వంద కోట్ల లోపే ఉన్నా.. కనీసంగా రూ. ఇరవై కోట్ల యాడ్స్ ఇవ్వకపోతే ప్రభుత్వానికి నిద్రపట్టదు. అలాంటిది డబ్బులు వసూలు చేసే పథకానికి ఇవ్వకుండా ఉంటారా..?
ఫుల్ పేజీలు ఇచ్చి కుమ్మేశారు. ఈ వ్యవహారం అంతా నిరుపేదలకు మాత్రం విచిత్రంగా ఉంది. ప్రభుత్వం ఇంత వరకూ ఏదో పథకం కింద ఇంతో ఇంతో ఇచ్చి పథకాలన్నది కానీ.. ఇప్పుడు తమ దగ్గర వసూలు చేస్తూ.. దీన్ని కూడా జగనన్న పథకంగా చెబుతూండటమే వారిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచి.. తాగుడు మాన్పించడానికేనని చెప్పినట్లుగానే ఈ ప థకం స్టైల్ కూడా ఉందని వారు గుసగుసలాడుకుంటున్నారు. అంతకు మించి ఏమీ చేయలేరు.. కనీసం ఏమైనా మాట్లాడినా ఏం జరుగుతుందో వారికి తెలుసు..