స్కిల్ డెలవప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఎండీగా ఉన్న వ్యక్తిని కాదని డైరక్టర్ ఉన్న వ్యక్తిని ఏ-1గా పెట్టడం ఏమిటి ? నిర్ణయాలు తీసుకుని.., డబ్బులు రిలీజ్ చేసిన వారిని పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? సుబ్బారావు నిధులు దుర్వినియోగం చేశారని ఏదైనా ఆధారాలు ఉన్నాయా ? ఇవన్నీ హైకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలు. కానీ సీఐడీ దగ్గర ఒక్కదానికీ సమాధానం లేదు. దీంతో స్కిల్ డెలవప్మెంట్ స్కాంలో ఏ-1గా చూపించిన గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతుల బెయిల్ మంజూరు చేసింది.
సీఐడీ విచారణకు హాజరు కావాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కీలకమైన వ్యక్తుల్ని వదిలేసి కొంతమందిని మాత్రమే కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్కిల్ డెలవప్మెంట్ కార్పొరేషన్లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసులు పెట్టింది. ఘంటా సుబ్బారావుతోపాటు మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణతో సహా పలువుర్ని నిందితులుగా చేర్చారు.
అయితే నిధులు విడుదల చేసింది అప్పటి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి అని అలాగే నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు సీఎంవోలో కీలకంగా ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్లు అని వారిని కాకుండా కేవలం సలహాలకు మాత్రమే పరిమితయ్యేవారిపై కేసులు పెట్టడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఐడీ సరైన కారణాలు చెప్పకపోతే.. కీలక మలుపులు తీసుకునే అవకాశం ఉంది.