(ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం)
భాష అంటే మాట్లాడే, రాసుకునే మాధ్యమం కాదు. అది ప్రజల చరిత్ర, సంస్కృతీ, జీవన విధానాల వ్యక్తీకరణ. వ్యవసాయం అంతరించిపోవడమో, రూపాంతరం చెందడమో జరుగుతున్నందువల్ల రెండు వందల పదాలు తెలుగునుంచి మాయమైపోయాయ. యంత్రీకరణతో వంటిల్లు ఆధునిక రూపమెత్తడం వల్ల యాభై అవవై పేర్లు మనమాతృభాష నుంచి అంతర్ధానమైపోయాయి. మనుషుల సాంఘిక జీవనం టివిలకు ఔటింగలకు అతుక్కుపోవడం వల్ల మరెన్నో మాటలు తెలుగునుంచి వైదొలగిపోయాయి.
జీవితం పరాయీకరణ అయిపోయాక పరాయి పదాలే చిలకపలుకులై క్రమంగా జీవన విధానంలో ఇంకిపోతాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఏప్రాంతంలో అయినా జరిగేది ఇదే!
భాష కదలికలు లేని జడపదార్ధం కాదు. వాడుక ఆగిన కొన్ని మాటలను వొదిలించుకుంటూ, అలవాటౌతన్న పరభాషా పదాలను ఇముడ్చుకుంటూ సాగిపోయే చైతన్య పూరితం! ఈ తరం వాళ్ళకు అర్ధమయ్యేలా సూటిగా చెప్పాలంటే భాష స్టాటిక్ గా వుండి పోయేది కాదు…భాష డైనమిక్ గా సాగిపోయేదే. ఇందువల్ల భాష అంతరించిపోతోందని సందర్భమొచ్చినపుడల్లా గుండెలు బాదుకోనవసరం లేదు.
కాకపోతే, భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకన్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు , ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి. తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో, తెలుగుభాషలో కూడా చెప్పగలగితే రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల భాషనుంచి మేధస్సు, ఆలోచనల స్ధాయికి తెలుగు విస్తరించాలి.
యూనీకోడ్ ఫాంట్లు కంప్యూటర్ లో ప్రవేశించడం వల్లే ఇక్కడ ఇది నేను రాయగలిగాను. మీరు చదవగలుగుతున్నారు. తెలుగు స్పెల్,గ్రామర్ చెకర్ లు రూపొందించడానికి కేంద్రీయ విశ్వ విద్యాలయం గతంలో మొదలు పెట్టిన ప్రయత్నాలను పున:ప్రారంభించాలి. డిగ్రీదాకా తెలుగును నిర్బంధం చెయ్యాలి.
ఇవన్నీ ఉరుకులు పరుగుల మీద చేసినా కూడా ఫలితాలు వెంటనే కనిపించవు. భాషను కాపాడటం, ఆధునీకరించడం ఒక స్వతంత్ర సంస్ధ సమన్వయంతో విద్యాసంస్ధలు, సమాచార సాధనాల ప్రధాన పాత్రగా జరగాలి. ఏ పనీ ఆగకుండానే భాషా ప్రమాణీకరణను కూడా నిరంతరం కొనసాగిస్తూనే వుండవచ్చు.
ఇవేమీ జరగనప్పుడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం లాంటివి భాషను ఆవేశాలతో, ఉద్వేగాలతో ప్రేమించేవారికి కాసేపు హడావిడి, హుషారు మాత్రమే మిగులుతుంది.
భాషావికాసం, ఔన్నత్యాలకు తెలుగురాష్ట్రాల్లో కనుచూపుదూరంలో అవకాశమే లేదు. ఎందుకంటే ….ముస్లిం పాలకుల ప్రభావం వల్ల తెలంగాణాలో ఉర్దూ, హిందీ యాసలు కలసిన తెలుగు, ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు పదాలు కలసిన తెలుగు వర్ధిల్లుతున్నాయి.
ఇతరులకంటే కాస్త లోతుగా కెసిఆర్ జన హృదయాలలో చొరబడిపోడానికి తెలంగాణా నుడికారాన్ని అందిపుచ్చుకోవడం ఒక కారణం. అయితే అది తెలంగాణా ప్రభుత్వ విధానంకాదు. సభల్లో, సందర్భాల్లో లాంఛనంగా చెప్పే మాటలే తప్ప భాషా సంస్కృతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ప్రేమా ఆసక్తీ లేవు!