ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు వచ్చినా.. నీతిఆయోగ్ సీఈవో వచ్చినా ఏపీ సీఎం జగన్ వారిని మొదటిగా అడిగే ఒకే ఒక్క కోరిక.., తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిల్ని ఇప్పించమని కోరడం. వచ్చిన వారికి.. ఆ వివాదానికి అసలు సంబంధమే లేదని చెప్పినా వినరు.. వినిపించుకోరు. ఇప్పుడు అసలు కేంద్రం కూడా తమకేమీ సంబంధం లేదని తేల్చేసింది. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డినే ఈ విషయాన్ని కేంద్రం ద్వారా చెప్పించారు.
తెలంగాణ …ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలపై ఏంచేశారని ఆయన రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ డీటైల్డ్ సమాధానం చెప్పారు. తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాశారని …కానీ ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లిందన్నారు.
విషయం కోర్టులో ఉన్నందున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని సమస్యనుపరిష్కరించుకోవాలని సూచించారు. టీడీపీ హయాంలో తెలంగాణ విద్యుత్ సంస్థలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉపసంహరించుకున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. చివరికి ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసు కోర్టులో ఉంటే ఎప్పటికి తేలుతుందో అంచనా వేయడం కష్టమే.