దేశంలో మళ్లీ కరోనా కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒమిక్రాన్ వైరస్ గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. అది ఇండియాను కూడా చుట్టు ముడుతోంది. అయితే మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్‌ను కూడా ఈవెంట్‌లా నిర్వహించిన కేంద్రం తర్వాత అంతా రాష్ట్రాల బాధ్యతేనని చెబుతోంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. ఇప్పటికే రెండు, మూడు సార్లు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి అదే చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని … అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని లేఖలు రాసింది.
ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలని కేంద్రం సూచించింది.ఒమిక్రాన్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సమయానుకూలంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచెబుతోంది. అవసరాన్ని బట్టి నైట్ కర్ఫ్యూలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలు చేపట్టాలని… ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
కేంద్రం ఇలా ఆదేశాలు ఇవ్వడమే ఆలస్యం.. అలా కర్ణాటక ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. ఎలాంటి వేడుకలకు పర్మిషన్ లేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరిగే కొద్దీ.. రాష్ట్రాలు కూడా ఆంక్షల స్థాయిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే… ఈ సారి కూడా ఒకటి… రెండు నెలల పాటు కర్ఫ్యూలు.. ఆంక్షలు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నయి.