ఏపీలో ఇప్పుడు అంతా రహస్య పాలన జరుగుతోంది. నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జీవోలు బయటకు రావు. ఎప్పుడో పది.. పదిహేను రోజుల తర్వాత ప్రజలకు తెలియాలంటే జీవోలు బయటకు వస్తాయి. ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘనేనని.. జీవోలను వెబ్సైట్లో పెట్టాలని కోరుతూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణలో ఏపీ ప్రభుత్వం తమది అంతా సీక్రెట్ పరిపాలనేనని అంగీకరించింది.
టాప్ సీక్రెట్ జీవోలను మాత్రమే వెబ్ సైట్లో పెట్టడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అదే సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది.. కేవలం ఐదు జీవోలను మాత్రమే వెబ్ సైట్లో పెడుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే.. ఐదు శాతమే పారదర్శకపాలన..మిగిలిన అంతా.. సీక్రెట్ పాలన అన్నట్లుగా ప్రభుత్వం అంగీకరించిన్టలయింది. జీవోలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసింది.. ఎన్ని జీవోలు వెబ్సైట్లో ఉంచింది.. సీక్రెట్ అంటూ అప్లోడ్ చేయని జీవోల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే జీవోలు రహస్యంగా ఉంచడంపై అనేకఅనుమానాలున్నాయి. ఇప్పుడు రహస్య జీవోలు వెలుగులోకి వస్తే.. ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.