వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై సీబీఐ ఇప్పటికే ముందస్తు సన్నాహాలన్నీ చేసుకుంది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రెండు, మూడు రోజుల్లో ఆయనను అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అవినాష్ రెడ్డి క్యాంప్ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ పైన.. వైఎస్ వివేకా కుమార్తె పైనా ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.
కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కొద్ది రోజులు విచారణ నిలిపివేసి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చి ఇప్పుడు నేరుగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూండటంతో.. ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.