ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకే కాదు.. అధికార వ్యవస్థలో భాగమైన వారికీ సహనం తక్కువగా ఉంటోంది. ఎంతటి వారినైనా.. ఎలాంటి మాటలు అనేందుకైనా.. బెదిరించేందుకైనా.. అవసరమైతే కొట్టేందుకైనా వెనుకాడబోమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే అనేక పరిణామాలు సంచలనంగా మారగా.. తాజాగా హైకోర్టులో న్యాయమూర్తితో ప్రభుత్వ లాయర్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమయింది.
హైకోర్టులో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకోవడంపై విచారణ జరుగుతోంది. జస్టిస్ మానవేంద్రరాయ్ బెంచ్ విచారణ జరుపుతూండగా… కేశినేని నాని ఓటు చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని లాయర్ గట్టిగా వాదించారు. కౌన్సిలర్ల కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఆ కౌన్సిలర్ల తరపున ఏపీ సర్కార్ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన లాయర్ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు బెదిరింపుల స్థాయికి వెళ్లాయి. ఆయన భాష విని కంగారు పడిన జడ్జి.. కేసును వాయిదా వేశారు.
తర్వాత ఈ కేసును తాను వినదల్చుకోలేదని.. వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సీజేకి సిఫార్సు చేశారు. ఇప్పుడీ వ్యవహారం న్యాయవర్గాల్లోనూ సంచలనాత్మకం అవుతోంది. న్యాయమూర్తులతో నేరుగా గతంలో దూకుడుగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయింది. అదే తరహాలో కౌన్సిలర్ల తరపు లాయర్ కూడా మాట్లాడటంతో న్యాయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.