ఈ శుక్రవారం `శ్యామ్ సింగరాయ్` వస్తోంది. తెలుగులో, థియేటర్లలో విడుదల అవుతున్న సినిమా అదే. అయితే.. ఈ సినిమాకి `83` రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఆ ప్రయాణానికి సంబంధించిన కథ ఇది. దేశ వ్యాప్తంగా విడుదల అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మల్టీప్లెక్సులలో.. `83` హవా గట్టిగా ఉండబోతోంది. అయితే తెలుగులో ఈ సినిమాకి ప్రమోషన్లు సరిగా లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. అయినా సరే, ప్రమోషన్ల పరంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు.
ఇదో హిందీ సినిమా. కాకపోతే తెలుగులోనూ డబ్ చేశారు. ప్రధాన పాత్రకు సుమంత్ డబ్బింగ్ చెప్పాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి, తెలుగులోనూ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో జరగలేదు. గురువారం ఓ ఈవెంట్ ఉంది. అయితే.. ఒక్క రోజు వ్యవధిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి.. పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. 83లో నటీనటులంతా బాలీవుడ్ వాళ్లే. కాకపోతే.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ సినిమా వస్తోందో, రావడం లేదో జనాలకు అర్థం కాదు. ఈ విషయంలో `ఆర్.ఆర్.ఆర్`, `పుష్ప`లాంటి సినిమాలే మేలు. సినిమా విడుదల సమయంలో.. ముంబైలోనూ భారీగా ప్రమోషన్లు చేశారు. బాలీవుడ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎదగాల్సివుందేమో..?