కొణిజేటి రోశయ్య చనిపోయినా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చివరి చూపునకు వెళ్లలేదు. ఆయన సంస్మరణ కార్యక్రమానికీ వెళ్లలేదు. హఠాత్తుగా రోశయ్యపై బాలినేనికి ఎక్కడా లేని ప్రేమ పుట్టుకు వచ్చింది. కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లాతో ఉన్న బంధం విడదీయరానిదని.. ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివ ర్గంలో తాను ఒక మంత్రినని యన రుణం కొంతైనా తీర్చుకునేందుకు ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఏ స్థలంలో రోశయ్య విగ్రహాన్ని పెడితే బాగుంటుందో వారం రోజుల్లో సూచించాలని సలహా ఇచ్చారు.
ఇంత అర్జంట్‌గా బాలినేనికి రోశయ్య ఎందుకు గుర్తుకు వచ్చారంటే.. సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని ఆర్యవైశ్యులంతా తమపై జరిగిన దాడిగా భావించడమే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసిందన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఓ ముస్లిం నేతతో ఆర్యవైశ్య నేతను కొట్టించడం.. కావాలని వీడియో కాల్లో చూపించడం.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం అంతా.. తమ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించారన్న అభిప్రాయంతో ఉన్నారు. దీంతో వైసీపీ పెద్దలు అప్పటికప్పుడు సుబ్బారావు గుప్తాను విజయవాడకు పిలిపించి.. కేక్ తినిపించి.. సానుకూల ప్రకటనలు చేయించారు.
కానీ వైసీపీ నేతలు అందరిదీ బెదిరింపు దందానే కాబట్టి.. ప్రాణభయంతో సుబ్బారావు గుప్తా అలా చెప్పారని.. జరిగినదంతా మర్చిపోయే ప్రసక్తి లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. దీంతో బాలినేని ఆ వర్గాలను మంచి చేసుకునేందుకు రోశయ్య కాంస్య విగ్రహ ప్రస్తావన తీసుకు వచ్చారు. అయితే ఆర్యవైశ్యులు బాలినేని పెట్టించే విగ్రహం కోసం పోలోమని వెళ్తారా లేక.. ఆయనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు అవసరానికి ముందుకు వస్తారా అనిలైట్ తీసుకుంటారో వేచి చూడాలి!