రిజర్వేషన్లు కోరుతూ హర్యానాలో జాట్ కులస్తులు చేస్తున్న ఉద్యమం నేడో రేపో ముగిసే అవకాశం కనపడుతోంది. ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చించిన జాట్ నేతలకు ఆయన త్వరలో జరుగబోయే హర్యానా శాసనసభా సమావేశాలలో జాట్ కులస్తులకు ఓ.బి.సి.లో చేర్చేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందినట్లు కనబడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను అద్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
ఆ హామీలతో సంతృప్తి చెందిన జాట్ సంఘర్ష్ సమితి నేత జైపాల్ సింగ్ సంగ్వాన్ మీడియా ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొంటున్న జాట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ “హోం మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయి. మాకు ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఈ హామీలు అంగీకారమేనని నేను భావిస్తున్నాను. కనుక తక్షణమే ఉద్యమాన్ని నిలిపి వేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
ప్రస్తుతానికి ఈ కధ సుఖాంతం అయినట్లే కనిపిస్తోంది కానీ జాట్ ల ఉద్యమానికి ప్రభుత్వం దిగిరావడం వేరే ఇతర కులస్తులకు ప్రేరణ కలిగించి వారు కూడా రిజర్వేషన్లు కోరుతూ ఇలాగే ఉద్యమాలు మొదలుపెడితే కేంద్రరాష్ట్రప్రభుత్వాలకి తట్టుకోవడం చాలా కష్టం కావచ్చు.ఇప్పటికే గుజరాత్ లో హార్దిక్ పటేల్, ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లు కోరుతూ పోరాటాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్లు వినిపిస్తూనే చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఈ ఉద్యమం ప్రేరణ కలిగిస్తే ప్రభుత్వాలకి తట్టుకోవడం చాలా కష్టమే.