కెసిఆర్ అంటే చంద్రబాబు + రాజశేఖర రెడ్డి అంటూ Telugu360 లో కథనం చూశాక ఈ సంగతి గుర్తుకు వచ్చింది. “మీలో ఎన్టీఆర్ చంద్రబాబు ఇద్దరూ వున్నారని” అప్పటి ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర రెడ్డితో ఒకసారి నేను అన్నాను. దానికి ఆయన చుట్టూ వున్న వారు విపరీతంగా నవ్వితే ఆయన కూడా మరోసారి అడిగి చెప్పించుకుని హాయిగా నవ్వేశారు.
టీవీ9 నిర్వహించే మిస్టర్ చీఫ్ మినిస్టర్ కార్యక్రమం పట్ల అప్పట్లో చాలా ఆసక్తి వుండేది. నేను రెండు మూడు వారాలకోసారి తప్పక పాల్గొనే వాణ్ని. అక్కడ ముఖ్యమంత్రి చెప్పింది వినడం తప్ప విమర్శనాత్మకంగా అడగడం కుదరదనే ప్రచారం వుండేది. కాని నేను చాలా సార్లు చాలా తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తిగత ప్రశ్నలు వేసిన సందర్బాలున్నాయి.వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.
ఆ కార్యక్రమానికి ఆయన ముందుగానే వచ్చేవారు. లేదా మేమే లోపలకి వెళ్లితే కబుర్లు నడిచేవి. ఏదైనా పర్యటనలో వుంటే ఆ సమయానికి చేరుకుని కాస్త ప్రెష్ అయ్యి లుంగీ మీద వచ్చేసేవారు. మొదట తప్పనిసరిగా కాస్సేపు జోకులు ఛలోక్తులు ఆఫ్ ద రికార్డ్ సంభాషణలు.. ఇది కూడా అలాటి సందర్భమే.
ఎన్టీఆర్ తాను తెలుగు వల్లభుడినని అపర కృష్ణదేవరాయలనని భావించేవారు.విష్ణువు పది అవతరాలు ఎత్తాడు, పదకొండో అవతారం కింద ఇప్పుడు సచివాలయంలో వున్నాడని ప్రసిద్ధ కవి పరిశోధకుడు ఆరుద్ర ఒకసారి తమాషాగా అన్నారు ఇక చంద్రబాబు చీఫ్ మినిస్టర్ (సిఎం) కన్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇవో) అనిపించుకోవడమే తనకు ఇష్టమని ప్రకటించారు. ఇది ఆయన కార్పొరేట్ మనస్తత్వానికి నిదర్శనమని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రెండు మాటలూ గుర్తు చేస్తూ “మీరైతే ఏమీ చెప్పకుండానే సిఇవో + రాజు రెండు లక్షణాలూ కలిసి అనుభవిస్తున్నారు ” అని నేనన్నాను. రాజశేఖరరెడ్డికి ఫ్యూడల్ నేతగా పేరున్నా నిజానికి వ్యాపార సంస్థలూ లావాదేవీలు ఎన్నో వున్న ఆయన కార్పొరేట్ యుగానికి కూడా ప్రతినిధే. అందుకే ఆయన ఫ్యూడల్ కమ్ కార్పొరేట్ అని నేను అప్పుడూ ఇప్పుడూ అనుకుంటుంటాను. వీటన్నిటికి విభేదాల కాంగ్రెస్లో కూడా వ్యక్తిగతంగా పట్టు కలిగిన నాయకుడు. ఇవన్నీ దృష్టిలో వున్నందువల్లనే మీరు రెండూ కలిపి నడిపించుకుంటున్నారు అన్నాను. మొదట ఆయన అంతగా వినలేదు గాని తన సహాయకులు ఐఎస్ఎస్ అధికారులూ కూడా బిగ్గరగా నవ్వాక మరోసారి అడిగి చెప్పించుకున్నారు. తను కూడా అలాగే నవ్వేశారు! అదీ జరిగింది!
ఈ సంగతి నేను చంద్రబాబుకు కూడా చెప్పాను.మరోసారి అధికారంలోకి రావడం కోసం ఈ సిఇవో ఇమేజి నుంచి బయిటపడటానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆయనను అదే పేరుతో పిలుస్తున్నారు గాని అర్థం కొంచెం మారింది-ఇప్పుడు పార్టీ వాళ్లు అధికారులు చీఫ్ ఈవెంట్ ఆర్గనైజర్ అంటున్నారు. పెట్టుబడులు రాబట్టడానికే ఈవెంట్లు నిర్వహిస్తున్నానని ఆయన అంటున్నారు. అదంతా వేరే చర్చ. తమ పథకాలూ ప్రణాళికల ప్రకారం కష్టపడ్డంలో ఈ ఇద్దరూ ఇద్దరే. ఎన్టీఆర్ సంగతి వేరు. ఆయన సంప్రదాయ రాజకీయ వేత్త కాదు, ఒక మూసలో ఇమడని ఆవేశం ఒకింత అహం(బ్రహ్మస్మిలా) ఆయన స్వంతం.అంత చరిత్ర గల వారికి ఆ మాత్రం వుండకపోతే ఆశ్చర్యపోవాలి గాని వుండటం సహజమే కదా !