ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేసినా భావోద్వేగానికి గురవుతూంటారు. వారి జీవితాల్ని బాగు చేస్తున్నందుకు ఆనందపడుతూ ఉంటారు. వృద్ధులకు రూ. 250 పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున ఆయన అమితమైన ఆనందాన్ని పొందుతున్నారు. జనవరి ఒకటి నుంచి సామాజిక పెన్షన్లను రూ. రెండున్నరవేలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అవ్వా, తాతలకు తన ఆనందాన్ని చెబుతూ లేఖ రాస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్‌తో పాటు ఈ లేఖను కూడా వారికి అంద చేస్తారు.
పాదయాత్రలో చాలీచాలని పెన్షన్‌తో ఎన్ని అవస్తలు పడ్డారో చూశానని వాటిని తీర్చేందుకే పెన్షన్ పెంచానన్నాన్నారు. గత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చిందని ఇప్పుడు 61 లక్షల మందికి ఇస్తున్నామన్నా. ప్రభుత్వం నెలకు రూ.1,450 కోట్లు వృద్ధుల పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నామన్నారు. కరోనా వల్ల ఎంత కష్టమైనా చిరునవ్వుతో రూ.18,000 కోట్ల పెన్షన్ల ఖర్చును భరిస్తున్నామన్నారు.
పెన్షన్లను క్రమంగా రూ.3 వేల వరకు పెంచుతాం అన్న మాటను నిలబెట్టుకుంటున్నామని జగన్ వృద్ధులకు లేఖలో తెలిపారు. పెన్షన్ అందుకోవడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ, వార్డు వలంటీర్ లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని జగన్ సూచించారు. కులం, మతం, ప్రాంతం ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా జగన్ తెలిపారు. ఎవరికైనా పెన్షన్ రాకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జగన్ సూచించారు.