కేటీఆర్ కుమారుడు హిమాన్షు మీద తీన్మార్ మల్లన్న పెట్టిన ఓ ఫేస్బుక్ పోల్ సృష్టించిన వివాదంలో .. ఇతర నేతలందరూ ఒక్కటే ప్రశ్న ప్రధానంగా సంధించారు..అదేమిటంటే.. ఇంతకీ కేటీఆర్ ఎక్కడున్నారు ? అని. నిజంగానే కేటీఆర్ హైదరాబాద్‌లో లేరు. ఎక్కడున్నారో రాజకీయవర్గాలకు తెలియదు. మంత్రులు, ఎంపీలు వారం రోజుల పాటు ఢిల్లీలో వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంతో పోరాటం అని ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేశారు. అయితే కేటీఆర్ అటు ఢిల్లీకి పోలేదు.. ఇటు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమమంలోనూ పాల్గొనలేదు.
అసలు కేటీఆర్ హైదరాబాద్‌లో లేరని.. రహస్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారని విపక్ష నేతలు విమర్శలు ప్రారంభించారు. మొదటగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించడం ప్రారంభించారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా.. గుట్టు చప్పుడు కాకుండా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారని.. ఏం పని మీద వెళ్లారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు . మరో ఎంపీ సంతోష్ కూడా వెళ్లారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కూడా తన విదేశీ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దుబాయ్ వెళ్లారని.. అక్కడ్నుచి జర్మనీ.. ఆ తర్వాత ఆమెరికాకు వెళ్లారని టీ కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే కేటీఆర్‌ది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని అందుకే ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని తెలుస్తోంది. అధికారిక పర్యటన అయితే ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తారు కదా అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ముందు ముందు కేటీఆర్ విదేశీ పర్యటన హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.