వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ చేసిందెవరు ?. ఈ అంశం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు… స్వయంగా మంత్రి హోదాలో ఉన్న ఒకరిని పక్కన పెట్టుకుని వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడం సహజంగానే కలకలంరేపుతోంది. అంతగా రెక్కీ నిర్వహిస్తే ఆ నిందితుల్ని పట్టుకోకుండా రాజకీయ ఆరోపణలు ఎందుకు చేస్తారనేది కీలకం. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ అంతర్గత రాజకీయాలు ఉన్నాయని తెలుస్తోంది. దేవినేని అవినాష్‌కు వైసీపీ నుంచి పొగ పెట్టేలా కొడాలి నాని, వంశీ … వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఈ వ్యూహం పన్నారని భావిస్తున్నారు.
అలా వంగవీటి ఆరోపణలు చేసిన తర్వాత ఇలా గుణదల గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గుణదల గ్యాంగ్ అంటే దేవినేని అవినాష్ గ్యాంగ్. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఓ సారి ఆయన ఇంటి ముందే హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఆయన ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ రెండింటినీ అవినాష్ గ్యాంగే చేసింది. ఆ దాడులు జరిగినప్పుడే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ జరిగిందని ప్రచారంచేస్తున్నారు. అంటే.. దేవినేని వర్గమే మళ్లీ దాడులకు పాల్పడుతోందని చెప్పాలనుకుంటున్నారు. ఈ అంశాన్ని్ మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
విజయవాడలో దాడులకు పాల్పడుతున్న ముఠా ప్రస్తుతానికి దేవినేని అవినాష్ వర్గమే. కావాలని కాకపోయినా.. తమ పార్టీ రాజకీయ అవసరాలకు అవినాష్‌ను .. ఆయన అనుచరుల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు అదేకారణం చూపించి ఆయనను బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. ఈ అంశంపై దేవినేని అవినాష్ వర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. మొత్తంగా చూస్తే ఇక ముందు దేవినేని అవినాష్‌కు వైసీపీలో గడ్డు కాలం ప్రారంభమైనట్లేనని అనుమానిస్తున్నారు.