బాలీవుడ్ ఇప్పుడు దక్షిణాది వంక చూస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇటీవల టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుగు సినిమాల్లో ఎలాగైనా సరే భాగం పంచుకోవాలని కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారంటే – టాలీవుడ్ సత్తా ఏమిటో అంచనా వేసుకోవచ్చు. బాహుబలిలో కరణ్ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్, లైగర్‌లోనూ తన పాత్ర ఉంది. తెలుగు మార్కెట్ ని, పాన్ ఇండియా సినిమాని తను చక్కగా అర్థం చేసుకోగలిగాడు. తెలుగు సినిమాని హిందీలో తన వంతుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఓ తాజా ఇంటర్వ్యూలో… తెలుగు సినిమానీ, మన రాజమౌళి, ప్రభాస్, బన్నీలను ఆకాశానికి ఎత్తేశాడు.
”RRR తొలి రోజు హిందీలో రూ.30 కోట్లు వసూలు చేయబోతోంది. ఇది నిజంగా చాలా గొప్ప అంకె. పాన్ ఇండియాకి అసలైన అర్థం ఇది. బాహుబలి 1తో పాన్ ఇండియా అంటే ఏమిటో తెలిసింది. ఇది వరకు తెలుగు సినిమా, హిందీ సినిమా అని మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది. ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగులో డెమి గాడ్స్. కానీ హిందీలో జూ.ఎన్టీఆర్ అంటే ఎవరికీ తెలీదు. రామ్ చరణ్ తెలీదు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ ఏమిటో తెలుసు. అయినప్పటికీ.. రూ.30 కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య ఇంకె పెరగొచ్చు. అది పాన్ ఇండియా సత్తా. ఇటీవల పుష్ప అనే తెలుగు సినిమా హిందీలో డబ్ అయ్యింది. హిందీలో రూ.3 కోట్లు సాధించింది. అది.. తక్కువ సంఖ్యేం కాదు. మన హిందీ సినిమాలు సైతం ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం లేదు. పుష్ప కనీసం. పబ్లిసిటీ చేసుకోలేదు. ఓ పోస్టర్ వదిలి, డిజిటల్ ప్రమోషన్స్‌కి పరిమితమైంది. కానీ… ఈ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. బన్నీ డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుకే… తనకు ఓపెనింగ్స్ వచ్చాయి. చాలామంది తెలుగు హీరోలకు హిందీ శాటిలైట్ మార్కెట్ ఉంది. అది వాళ్లకు బాగా ఉపయోగపడుతోంది. నా ఆఫీసుకు ఎప్పుడూ జనం వస్తూనే ఉంటారు. హీరోలు, దర్శకులు కథలు చెప్పడానికి వరుస కడతారు. కానీ ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం నా ఆఫీస్ అంతా మార్మోగిపోయింది. వాళ్లు సంపాదించుకున్న క్రేజ్ అది. ఐదు భాషల్లో విడుదల చేసినంత మాత్రాన ఏ సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు. నేను స్పానిష్ లో సినిమాని డబ్ చేసి విడుదల చేయొచ్చు. అక్కడ నా సినిమా చూస్తారన్న గ్యారెంటీ ఏముంది? ” అని చెప్పుకొచ్చాడు కరణ్.