వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ పలువురు తెర ముందుకు వస్తున్నారు. తాజాగా వివేకానందరెడ్డి వద్ద సుదీర్ఘ కాలంగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ బెదిరిస్తున్నారని.. సంబంధం లేని కొంత మంది పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశఆరు.
కొద్ది రోజుల కిందట కృష్ణారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో కొంత మంది తనను బెదిరిస్తున్నారని.. తన ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కొంత మంది ఇతరుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించానని చెబుతున్నారు.
గతంలో అనంతపురం ఎస్పీని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా కలిసి.., ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని.. వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వంటి పేర్లు చెప్పాలని .. డబ్బులు కూడా ఆశ చూపారని ఆయన ఫిర్యాదు చేశారు. గంగాధర్ రెడ్డి కూడా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పడంతో ఆయనకూ పోలీసుల భద్రత కల్పించారు. ఇలా వరుసగా సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ కొంత మందికి తెరపైకి రావడం కేసులో కీలక మలుపులకు కారణం అవుతోంది. మొత్తంగా చూస్తే సీబీఐ అధికారుల్ని డిఫెన్స్ లో పెట్టడానికి చేయగలిగినన్ని పనులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.