కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీన చేసిన ప్రభుత్వం ఆంక్షలు తక్షణ అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘రెండు రోజులకు పైగా కరోనా పరీక్షల్లో పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటోంది. అందుకే ముందస్తు ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తున్నాం. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు గతంతో పోలిస్తే మేము 10 రెట్లు ఎక్కువగా సన్నద్ధతతో ఉన్నాం ’’అని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.
ఆంక్షలు విషయానికి వస్తే.. ముందుగా సినిమా హాళ్ళు, మల్టీ ప్లెక్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో మళ్ళీ చిత్ర పరిశ్రమపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కరోనాతో ఎక్కువగా నష్టపోయింది చిత్ర పరిశ్రమ. నెలలు పాటు థియేటర్లు మూతపడ్డాయి. సినిమాపై ఆదారపడిన అనేక కుటుంబాలు బిక్కుబిక్కుమని కాలం గడిపాయి. ఇప్పుడు మరోసారి దేశ రాజధాని ఆంక్షలు దిశగా వెళ్ళడంతో మిగతా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో అనేది ప్రశ్నార్ధకంగా మారింది.