వంగవీటి రాధాకృష్ణపై దాడి కోసం రెక్కీ నిర్వహించిన కేసు ఊహించినట్లుగానే దేవినేని అవినాష్ వద్దకు చేరుతోంది. ఆయన ప్రధాన అనుచరుడు.. ఇలాంటి దాడుల ప్రోగ్రామ్స్‌ను లీడ్ చేసే రౌడి షీటర్, పట్టాభిపై.. టీడీపీ ఆఫీసుపై దాడిలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ అరవ సత్యాన్ని రెండు రోజులుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణ దెబ్బకు తట్టుకోలేక ఆయన స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
అరవ సత్యం చెప్పిన వివరాలతో మరికొంత మందిని బెజవాడు పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అరవ సత్యాన్ని ఇంత వరకూ అదుపులోకి తీసుకున్నట్లుగా కానీ.. ప్రశ్నిస్తున్నామని కానీ పోలీసులు చెప్పడంలేదు. మరికొంత మంది వ్యక్తులు కూడా రెక్కీ నిర్వహించారని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
అయితే అరవ సత్యం అయినా… దేవినేని అవినాష్ అయినా వైసీపీ నేతలే. కార్పొరేటర్అయిన అరవ సత్యం వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. దేవినేని అవినాష్ జగన్‌కు సన్నహితుడిగా పేరు పొందాడు. ఇప్పుడీ కేసును ఇలా నీరుగారుస్తారా లేక… నిజంగానే నిందితుల్ని పట్టుకుని మీడియా ముందు పెడతారా అన్నది ఆసక్తికరం. వంగవీటి రాధాకు పోలీసులు టూ ప్లస్ టూ భద్రత కల్పించారు.